
ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియాకు చేదు అనుభవం ఎదురైంది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఆతిథ్య ఆసీస్.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. పెర్త్‌లో జరిగిన తొలి వన్డేలో ఏడు వికెట్ల తేడాతో గెలిచిన కంగారూలు.. తాజాగా అడిలైడ్ వేదికగా రెండో వన్డే (IND vs AUS 2nd ODI)లోనూ జయభేరి మోగించారు.
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా
అడిలైడ్ ఓవల్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. పర్యాటక భారత జట్టును తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ఒకే ఓవర్లో ఓపెనర్, కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (9)తో పాటు వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి (0) వికెట్ తీసి జేవియర్ బార్ట్‌లెట్ ఆసీస్‌కు శుభారంభం అందించాడు.
రాణించిన రోహిత్, శ్రేయస్
ఇలాంటి తరుణంలో మరో ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma), వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నారు. రోహిత్ (97 బంతుల్లో 73), అయ్యర్ (77 బంతుల్లో 61) పరుగులతో రాణించగా.. మిగతా వారిలో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ (41 బంతుల్లో 44), హర్షిత్ రాణా (18 బంతుల్లో 24 నాటౌట్) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు.
ఆసీస్ బౌలర్లలో స్పిన్నర్ ఆడం జంపా నాలుగు వికెట్లతో చెలరేగి భారత బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (11) నితీశ్ రెడ్డి (8) రూపంలో కీలక వికెట్లు దక్కించుకున్నాడు. పేసర్లలో బార్ట్‌లెట్ గిల్, కోహ్లి, వాషింగ్టన్ సుందర్ (12) వికెట్లు తన ఖాతాలో వేసుకోగా.. మిచెల్ స్టార్క్ రోహిత్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్ (13)లను అవుట్ చేశాడు.
264 పరుగులు
ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా తొమ్మిది వికెట్ల నష్టానికి 264 పరుగులు స్కోరు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో ఆసీస్ ఆరంభంలో తడబడింది. ఓపెనర్, కెప్టెన్ మిచెల్ మార్ష్ (11)ను అర్ష్‌దీప్ త్వరగానే పెవిలియన్‌కు పంపగా.. ట్రవిస్ హెడ్ (40 బంతుల్లో 28)ను హర్షిత్ రాణా అవుట్ చేశాడు.
అదరగొట్టిన షార్ట్, కన్నోలి
అయితే, వన్‌డౌన్ బ్యాటర్ మాథ్యూ షార్ట్ అద్భుత అర్ధ శతకం (74)తో మెరిసి మ్యాచ్‌ను తమ వైపు తిప్పే ప్రయత్నం చేయగా.. మ్యాట్ రెన్షా (30) అతడికి సహకరించాడు. షార్ట్, రెన్షా వేసిన పునాదిపై ఆల్‌రౌండర్ కూపర్ కన్నోలి మిచెల్ ఓవెన్‌తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించాడు.
Just the wicket #TeamIndia needed! 🤩#NitishKumarReddy gets the wicket and #MohammedSiraj makes amends for the dropped catch. 👏#AUSvIND 👉 2nd ODI | LIVE NOW 👉 https://t.co/dfQTtniylt pic.twitter.com/YZwdPY0nr7
— Star Sports (@StarSportsIndia) October 23, 2025
ఆఖర్లో వరుస విరామాల్లో వికెట్లు పడినా కన్నోలి పట్టుదలగా నిలబడ్డాడు. ఓవెన్ 23 బంతుల్లో 36 పరుగులతో వేగంగా ఆడి.. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో వెనుదిరగగా.. బార్ట్‌లెట్ (3), స్టార్క్ (4) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు.
అయితే, కన్నోలి మాత్రం నిలకడగా ముందుకు సాగాడు. 53 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 61 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. 46.2 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టపోయిన ఆస్ట్రేలియా లక్ష్యం పూర్తి చేసింది. రెండు వికెట్ల తేడాతో గెలిచి.. సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది.
ఇరుజట్ల మధ్య శనివారం నాటి నామమాత్రపు మూడో వన్డేకు సిడ్నీ వేదిక. కాగా వన్డే సారథిగా గిల్‌కు తొలి సిరీస్‌లోనే ఇలా చేదు అనుభవం ఎదురైంది. ఇక రెండో వన్డేలో జంపాకు ప్లేయర్ ఆఫ్ దిమ్యాచ్ అవార్డు దక్కింది.
చదవండి: బతికితే చాలనుకున్నా.. ఆకాశ్ అంబానీ హెల్ప్ చేశారు: తిలక్ వర్మ