
ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ యంగ్ టాలెంట్ ఎవరనే అంశంపై విజ్డన్ సంస్థ ఇటీవల ఓ సర్వే నిర్వహించింది. ఇందులో 23 అంతకంటే తక్కువ వయసు క్రికెటర్లను పరిగణలోకి తీసుకుంది. ఈ విభాగానికి సంబంధించి 40 మంది ఆటగాళ్లను ఎంపిక చేసి, ర్యాంకింగ్స్ ఇచ్చింది. ఈ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ (22) అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.
ఈ జాబితాలో జైస్వాల్‌తో పాటు మరో 8 మంది భారత యువ ఆటగాళ్లు చోటు దక్కింది. సాయి సుదర్శన్ 9, నితీశ్ కుమార్ రెడ్డి 12, తిలక్ వర్మ 14, వైభవ్ సూర్యవంశీ 16, హర్షిత్ రాణా 21, రియాన్ పరాగ్ 27, ముషీర్ ఖాన్ 31, మయాంక్ యాదవ్ 33 స్థానాల్లో నిలిచారు.
ఈ ర్యాంకింగ్స్ కేవలం గణాంకాల ఆధారంగానే కాకుండా ఒత్తిడిలో రాణించడం, భయం లేకుండా బంతిని బాదడం, పరిణితి ప్రదర్శించడం, బంతిని అత్యంత వేగంగా సంధించడం, బంతిని ఇరు వైపులా స్వింగ్ చేయడం వంటి పలు అంశాలను పరిగణలోకి తీసుకొని కేటాయించారు. ఈ జాబితాలో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ 16వ స్థానాన్ని దక్కించుకొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.