Tokyo Paralympics 2021: ‘మాకూ రెక్కలున్నాయి...’

We Have Wings Paralympics Off To Glittering Start In Tokyo - Sakshi

ఘనంగా పారాలింపిక్స్‌ ప్రారంభం

నేటి నుంచి ప్రధాన పోటీలు

సెప్టెంబర్‌ 5 వరకు మెగా ఈవెంట్‌

టోక్యోలో నెల రోజుల వ్యవధిలో మరో ప్రారంభోత్సవ కార్యక్రమం అదరగొట్టింది... ప్రధాన ఒలింపిక్స్‌కు ఏమాత్రం తగ్గని రీతిలో పారాలింపిక్స్‌ వేడుకలను కూడా నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పైకి ఎగసేందుకు ప్రయత్నించే దివ్యాంగ క్రీడాకారుల ఆశలను ప్రతిబింబించేలా ‘మాకూ రెక్కలున్నాయి’ అనే నేపథ్యంతో సాగిన ఈ ఉత్సవం ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులందరి మనసులూ దోచుకుంది.

టోక్యో: కరోనా సమస్యలను దాటి ఒలింపిక్స్‌ను విజయవంతంగా నిర్వహించిన జపాన్‌ ఇప్పుడు పారాలింపిక్స్‌ను అంతే స్థాయిలో అద్భుతంగా జరిపేందుకు సిద్ధమైంది. మంగళవారం జరిగిన ప్రారంభోత్సవ వేడుకలు అందుకు నిదర్శనం. మొదటినుంచి చివరి వరకు స్టేడియాన్ని రంగులమయంగా మారుస్తూ జరిపిన ప్రదర్శనలు జపాన్‌ కళలు, సంస్కృతిని చూపించడంతో పాటు పారాలింపిక్స్‌ అథ్లెట్ల పట్టుదలను దృశ్య రూపంలో ఆవిష్కరించాయి. బుధవారంనుంచి ప్రధాన పోటీలు ప్రారంభం కానుండగా... సెప్టెంబర్‌ 5 వరకు ఈ క్రీడలు జరుగుతాయి.

ముగ్గురు జ్యోతిని వెలిగించగా...
స్టేడియంలో ప్రేక్షకులకు అనుమతి లేకపోయినా పోటీల్లో పాల్గొంటున్న అథ్లెట్లలో మెగా ఈవెంట్‌ భావోద్వేగం కనిపించింది. గత ఏడాది కాలంగా కోవిడ్‌ విఘ్నాలను అధిగమించి 4,403 మంది ఆటగాళ్లు ఎదురు చూసి క్షణం రానే వచ్చింది. ముందుగా జపాన్‌ జాతీయ పతాకం మైదానంలోకి తీసుకు రావడంతో కార్యక్రమం మొదలైంది. దీనిని తెచ్చిన వారిలో ఆటగాళ్లతో పాటు టోక్యో అగ్నిమాపక విభాగానికి చెందిన కార్మికుడికి కూడా అవకాశం కల్పించడం విశేషం. ‘ఆప్టిక్‌ నెర్వ్‌ హైపోప్లాసియా’తో బాధపడుతూ పూర్తి అంధురాలిగా మారిన సటో హిరారి జపాన్‌ జాతీయ గీతం ఆలపించినప్పుడు స్టేడియంలోనివారంతా జేజేలు పలికారు. ఆ తర్వాత ‘పారా ఎయిర్‌పోర్ట్‌’ పేరుతో సాగిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. పెద్ద సంఖ్యలో శారీరక లోపాలు ఉన్నవారిని ఎందరినో ఈ రూపకంలో భాగం చేశారు.

అనంతరం నృత్య, విభిన్న సంగీత ప్రదర్శనలు జరిగాయి. అయితే అన్నింటికి మించి హైలైట్‌గా నిలిచిన అంశం ‘వన్‌ వింగ్డ్‌ ప్లేన్‌’. చక్రాల కుర్చీలో కూర్చున్న అమ్మాయి ఒకటే రెక్క ఉన్న విమానంలో ఎగురుకుంటూ వచ్చి తాను అందరిలాగే ఎగరాలనే కోరికను కనబర్చే అంశానికి చప్పట్లు మార్మోగాయి. మార్చ్‌పాస్ట్‌లో మొత్తం 162 జట్లకు చెందిన బృందాలు పాల్గొనగా రెఫ్యూజీ పారాలింపిక్‌ టీమ్‌ అందరికంటే ముందుగా నడిచింది. తాలిబన్ల కారణంగా తమ దేశంలో ఎదురైన అనూహ్య పరిస్థితుల నేపథ్యంలో అఫ్గానిస్తాన్‌ జట్టు చివరి నిమిషంలో పోటీలనుంచి తప్పుకుంది. అయితే వారికి సంఘీభావంగా ఒలింపిక్‌ కమిటీ తమ వాలంటీర్‌ ద్వారా మార్చ్‌పాస్ట్‌లో అఫ్గాన్‌ జాతీయ జెండాను కూడా ప్రదర్శించింది. ముగ్గురు జపాన్‌ పారా అథ్లెట్లు యు కమిజి, షున్‌షుకె ఉచిదా, కరిన్‌ మరిసకి సంయుక్తంగా ఒలింపిక్‌ జ్యోతిని వెలిగించడంతో అధికారికంగా పోటీలు ప్రారంభమయ్యాయి.


అఫ్గాన్‌ జెండాతో... 

ఫ్లాగ్‌ బేరర్‌గా టెక్‌ చంద్‌...
భారత జట్టు మార్చ్‌పాస్ట్‌కు సంబంధించి  అనూహ్య మార్పు చోటు చేసుకుంది. ఫ్లాగ్‌ బేరర్‌గా ప్రకటించిన రియో ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత మరియప్పన్‌ తంగవేలు చివరి నిమిషంలో తప్పుకున్నాడు. టోక్యోకు మరియప్పన్‌తో కలిసి ప్రయాణించిన విదేశీ ఆటగాడు ఒకడు కరోనా పాజిటివ్‌గా తేలడమే అందుకు కారణం. ముందు జాగ్రత్తగా తంగవేలును పక్కన పెట్టాలని నిర్వాహకులు భారత జట్టుకు సమాచారం అందించారు. దాంతో షాట్‌పుట్‌లో పోటీ పడుతున్న టెక్‌ చంద్‌ ఫ్లాగ్‌ బేరర్‌గా ముందుకు సాగాడు. మొత్తంగా భారత బృందంనుంచి 9 మంది మార్చ్‌పాస్ట్‌లో పాల్గొన్నారు.

పారాలింపిక్స్‌లో నేడు (భారత్‌) 

  •      మహిళల సింగిల్స్‌ టేబుల్‌ టెన్నిస్‌: సోనల్‌ బెన్‌ పటేల్‌ – క్లాస్‌ 3 (ఉ.గం.7.30),
  •     భావినా బెన్‌ పటేల్‌ – క్లాస్‌ 4 (ఉ.గం.8.50) 
Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top