T20 WC 2022: పేరుకే రెండుసార్లు చాంపియన్‌.. మరీ ఇంత దారుణంగా! సూపర్‌-12లో ఐర్లాండ్‌

WC 2022: Ireland Beat 2 Times Champion West Indies Qualifies Super 12 - Sakshi

రెండుసార్లు ప్రపంచ చాంపియన్, విధ్వంసక ఆటగాళ్లకు పెట్టింది పేరు, టి20 ఫార్మాట్‌కే కొత్త వినోదాన్ని అందించిన జట్టు చివరకు ఇలా మారిపోయింది! ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించకపోవడమే ఒక వైఫల్యం కాగా, ఇప్పటి ప్రదర్శన వెస్టిండీస్‌ క్రికెట్‌కు మరో విషాదం! అర్హత పోరులో తమకంటే కూనలైన జట్లపై రెండు మ్యాచ్‌లలో కూడా నెగ్గలేని కరీబియన్‌ బృందం వేదనతో నిష్క్రమించింది.

స్కాట్లాండ్‌ చేతిలో తొలి రోజే ఓడినా... 2016లో అఫ్గానిస్తాన్‌ చేతిలో ఎదురైన పరాజయం నుంచి కోలుకొని విశ్వవిజేతగా నిలిచినట్లుగా మళ్లీ చెలరేగి తమ స్థాయిని ప్రదర్శిస్తుందని   అంతా అనుకున్నారు. కానీ ఎలాంటి అద్భుతాలు జరగలేదు. ఐర్లాండ్‌ స్ఫూర్తిదాయక ఆట ముందు తలవంచిన మాజీ చాంపియన్‌ ఆట క్వాలిఫయింగ్‌ దశలోనే ముగిసింది. 90ల్లో టెస్టు క్రికెట్‌ చచ్చిపోయి ...2000ల్లో వన్డే క్రికెట్‌లో పూర్తి ఓవర్లు కూడా ఆడలేని స్థాయికి దిగజారి... ఈ రెండూ లేకపోయినా, 2010 తర్వాత టి20 దూకుడుకు చిరునామాగా మారి అద్భుతాలు చూపించిన వెస్టిండీస్‌ ఇప్పుడు ఈ ఫార్మాట్‌లో కూడా దిగజారడం క్రికెట్‌ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచే విషయం.   

హోబర్ట్‌: టి20 ప్రపంచకప్‌లో రెండుసార్లు (2012, 2016) చాంపియన్‌గా నిలిచిన వెస్టిండీస్‌ ఈసారి క్వాలిఫయింగ్‌ దశలోనే వెనుదిరిగింది. ‘సూపర్‌ 12’ దశకు అర్హత సాధించాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో విండీస్‌ ఓటమి పాలైంది. శుక్రవారం జరిగిన గ్రూప్‌ ‘బి’ పోరులో ఐర్లాండ్‌ 9 వికెట్ల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న వెస్టిండీస్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 146 పరుగులకే పరిమితం కాగా... ఐర్లాండ్‌ 17.3 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 150 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ఆడిన మూడు లీగ్‌ మ్యాచ్‌లలో రెండు గెలిచిన ఐర్లాండ్‌ ముందంజ వేయగా, ఒక విజయం సాధించిన వెస్టిండీస్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది.  

కింగ్‌ మినహా...
విండీస్‌ ఇన్నింగ్స్‌ పేలవంగా ప్రారంభమైంది. పవర్‌ప్లేలో మేయర్స్‌ (1), చార్లెస్‌ (18 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్‌) వికెట్లు కోల్పోయిన జట్టు 41 పరుగులు చేయగలిగింది. ఈ దశలో బ్రెండన్‌ కింగ్‌ (48 బంతుల్లో 62 నాటౌట్‌; 6 ఫోర్లు, 1 సిక్స్‌) జట్టును ఆదుకున్నాడు. అతను ఇచ్చిన రిట ర్న్‌ క్యాచ్‌ను సిమీ సింగ్‌ వదిలేయడం కూడా కొంత కలిసొచ్చింది.

అయితే లెగ్‌ స్పిన్నర్, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ గారెత్‌ డెలానీ (3/16) విండీస్‌ను దెబ్బ తీశాడు. తక్కువ వ్యవధిలో అతను లూయిస్‌ (13), పూరన్‌ (13), పావెల్‌ (6)లను అవుట్‌ చేయడంతో జట్టు కోలుకోలేకపోయింది. ఆరో వికెట్‌కు కింగ్, ఒడెన్‌ స్మిత్‌ (12 బంతుల్లో 19 నాటౌట్‌; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కలిసి 21 బంతుల్లో 34 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దినా భారీ స్కోరు మాత్రం సాధ్యం కాలేదు.  

స్టిర్లింగ్‌ జోరు...
ఛేదనలో ఐర్లాండ్‌ ఎక్కడా తడబడలేదు. ఓపెనర్లు పాల్‌ స్టిర్లింగ్‌ (48 బంతుల్లో 66 నాటౌట్‌; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఆండీ బల్బర్నీ (23 బంతుల్లో 37; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడుతూ శుభారంభం అందించారు. పవర్‌ప్లేలో 64 పరుగులు రాబట్టిన వీరిద్దరు తొలి వికెట్‌కు 45 బంతుల్లో 73 పరుగులు జత చేశారు. వీరిద్దరిని నిలువరించడంలో విండీస్‌ బౌలర్లు విఫలమయ్యారు. 32 బంతుల్లో స్టిర్లింగ్‌ అర్ధ సెంచరీ పూర్తయింది.

స్టిర్లింగ్, లార్కన్‌ టకర్‌ (35 బంతుల్లో 45 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కలిసి జట్టును విజయం దిశగా నడిపించారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 61 బంతుల్లో అభేద్యంగా 77 పరుగులు జత చేశారు. విజయానికి ఐర్లాండ్‌ మరో 40 పరుగుల దూరంలో ఉన్న దశలో టకర్‌ను స్మిత్‌ అవుట్‌ చేసినా అది నోబాల్‌గా తేలింది. మెకాయ్‌ బౌలింగ్‌లో కవర్స్‌ దిశగా టకర్‌ ఫోర్‌ కొట్టడంతో ఐర్లాండ్‌ సంబరాల్లో, వెస్టిండీస్‌ విషాదంలో మునిగిపోయాయి. 2009 వరల్డ్‌కప్‌ తర్వాత ప్రధాన గ్రూప్‌కు ఐర్లాండ్‌ అర్హత సాధించడం ఇదే తొలిసారి.  

సూపర్‌-12లో ఐర్లాండ్‌
ఏకంగా 9 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై విజయం సాధించి సగర్వంగా సూపర్‌-12లో అడుగుపెట్టింది. డిలానీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. ఇక క్వాలిఫైయర్‌ దశలోనే విండీస్‌ టోర్నీ నుంచి నిష్క్రమించడంతో ఆ జట్టు ఫ్యాన్స్‌ తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ‘‘పేరుకే రెండుసార్లు చాంపియన్‌. మరీ ఇంత ఘోరంగా విఫలమవుతారనుకోలేదు’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. గ్రూప్‌-ఏ నుంచి ఇప్పటికే శ్రీలంక, నెదర్లాండ్స్‌ సూపర్‌-12కు అర్హత సాధించిన విషయం తెలిసిందే.

చదవండి: T20 World Cup 2022: 'రిజ్వాన్‌, కోహ్లి, సూర్య కాదు.. అతడే ప్రపంచకప్‌ టాప్ రన్ స్కోరర్‌'
T20 WC 2022: పాకిస్తాన్‌కు ఊహించని షాక్‌.. కీలక బ్యాటర్‌ తలకు గాయం.. ఆస్పత్రికి తరలింపు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top