ముందు మీ టాప్‌ ఆర్డర్‌ చూసుకో : వసీం జాఫర్ 

Wasim Jaffer Trolled Brad Hogg About Australia Top Order - Sakshi

సిడ్నీ : ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్‌ బ్రాడ్‌ హాగ్‌కు టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్‌ తనదైన శైలిలో చురకలంటించాడు. సిడ్నీ వేదికగా ఆసీస్‌-ఎతో జరుగుతున్న ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో టాప్‌ ఆర్డర్‌ విఫలంతో 194 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్రాడ్‌ హాగ్‌ టీమిండియా టాప్‌ ఆర్డర్‌పై స్పందించాడు.' టీమిండియా టాప్‌ ఆర్డర్‌ ఆఫ్‌స్టంప్‌ ఎక్కడుందో తెలుసుకొని ఆడాలి. మంచి లెంగ్త్‌లో పడిన బంతిని ఆడకుండా వదిలేయడం నేర్చుకోవాలి.. అలాగే ఆఫ్‌ స్టంప్‌కు దూరంగా వెళ్తున్న బంతిని షాట్‌ ఆడేందుకు ప్రయత్నించకూడదు.. కానీ ఇలాంటి నియమాలేవి పాటించని టీమిండియా టాప్‌ ఆర్డర్‌ ఆటగాళ్లు నిర్లక్ష్యంగా వికెట్‌ పారేసుకున్నారంటూ' ట్రోల్‌ చేశాడు. హాగ్‌ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న వసీం జాఫర్‌ తనదైన శైలిలో చురకలంటించాడు. (చదవండి : మిస్టరీ స్పిన్నర్‌ పెళ్లి.. వైరలవుతున్న వీడియో)

'హాగ్‌.. మా మీద పడి ఏడ్వడం కంటే ముందు మీ జట్టు టాప్‌ ఆర్డర్‌ చూసుకొని మాట్లాడితే బాగుంటుంది. మరో నాలుగురోజులు గడిస్తే భారత్‌తో టెస్టు సిరీస్‌ ఆరంభం కానుంది. తొలి టెస్టులో ఓపెనర్లుగా ఎవరు రానున్నారనే దానిపై మీ జట్టుకు ఇంకా స్పష్టత రాలేదు. ముందు ఆ విషయం గురించి ఆలోచించండి ' అంటూ కౌంటర్‌ ఇచ్చాడు. ఇప్పటికే గాయం కారణంగా ఆసీస్‌ స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ దూరం కాగా.. ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో  త్యాగి బౌన్సర్‌ దెబ్బకు యువ ఓపెనర్‌ విన్‌ పుకోవిస్కి తలకు బలమైన గాయం కావడంతో మొదటి టెస్టుకు దూరమయ్యాడు కాగా విన్‌ పుకోవిస్కి స్థానంలో మార్కస్‌ హారిస్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు.  అంతేగాక ఆసీస్‌ కీలక బౌలర్‌ సీన్‌ అబాట్‌ ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో కండరాలు పట్టేయడంతో మళ్లీ బౌలింగ్‌కు రాలేదు. దీంతో అబాట్‌ మొదటి టెస్టు ఆడతాడా లేదా అనే విషయంపై స్పష్టత రాలేదు. కాగా ఇరుజట్ల మధ్య డిసెంబర్‌ 17న అడిలైడ్‌ వేదికగా తొలి డే నైట్‌ టెస్టు జరగనుంది.(చదవండి : క్యాచ్‌ వదిలేశాడని బౌలర్‌ బూతు పురాణం)

ఇక ఆసీస్‌-ఎతో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో టీమిండియా పటిష్ట స్థితిలో నిలిచింది. మూడో రోజు ఆటలో భాగంగా క్రితం రోజున చేసిన 386 పరుగుల వద్దే ఇన్నింగ్స్‌ను  డిక్లేర్‌ చేసిన భారత్‌ ఆసీస్‌ ఎ ముందు 472 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌ ఎ తడబడుతుంది. ఇప్పటివరకు చూసుకుంటే టీ విరామం సమయానికి 3 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. ఆసీస్‌ గెలవాలంటే ఇంకా 384 పరుగులు చేయాల్సి ఉంది. చివరి సెషన్‌ మాత్రమే మిగిలి ఉండడంతో మ్యాచ​ డ్రా అయ్యే అవకాశాలు  ఎక్కువగా ఉన్నాయి.. ఒకవేళ బౌలర్లు చెలరేగితే టీమిండియా విజయం సాధించే అవకాశం కూడా ఉంది. అంతకముందు రెండో ఇన్నింగ్స్‌లో రిషబ్‌ పంత్‌, హనుమ విహారిలు సెంచరీలతో కథం తొక్కిన సంగతి తెలిసిందే.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top