Virender Sehwag: మిస్టర్‌ మోర్గాన్‌.. లార్డ్స్‌ బయట ధర్నా చేయాల్సింది

Virender Sehwag Knocks Eoin Morgan Should Sat On Dharna Outside Lords - Sakshi

Virender Sehwag Knocks Eoin Morgan.. ఐపీఎల్‌ 2021లో ఢిల్లీ క్యాపిటల్స్‌, కేకేఆర్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో అశ్విన్‌- మోర్గాన్‌ మధ్య వివాదం ముదిరి పాకాన పడుతోంది. అశ్విన్‌దే తప్పు అని కొందరు విమర్శిస్తుంటే.. మోర్గాన్‌ది తప్పంటూ మరికొందరు పేర్కొంటున్నారు. తాజాగా టీమిండియా మాజీ విధ్వంసకర ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్‌ అశ్విన్‌కు మద్దతిస్తూ మోర్గాన్‌పై ట్విటర్‌ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత కేకేఆర్‌ వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తిక్‌ అశ్విన్‌- మోర్గాన్‌ విషయంలో జరిగిన గొడవ గురించి ప్రస్తావించాడు. రిషబ్‌ పంత్‌- అశ్విన్‌ జోడి రెండో పరుగు కోసం ప్రయత్నించడమే ఇక్కడ తప్పని.. అందుకే మోర్గాన్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడని చెప్పుకొచ్చాడు. కార్తిక్‌ కామెంట్స్‌పై సెహ్వాగ్‌ స్పందించాడు. 

చదవండి: Ashwin Vs Morgan: మోర్గాన్‌ తప్పు లేదు.. అశ్విన్‌ను అడ్డుకునే హక్కు ఉంది

''అది జూలై 14.. 2019 ప్రపంచకప్‌ ఫైనల్‌. ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ జరిగింది. ఆ మ్యాచ్‌ ఫైనల్‌ ఓవర్‌లో బెన్‌ స్టోక్స్‌ బ్యాట్‌కు తగిలి అదనంగా రెండు పరుగులు వచ్చాయి. దీంతో మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారి తీయడం.. సూపర్‌ ఓవర్‌లో ఇంగ్లండ్‌ విజయం సాధించడం జరిగిపోయాయి. మోర్గాన్‌ ప్రకారం న్యాయంగా ఉంటే ఓవర్‌ త్రోకు పరుగులు తీయకూడదు.. కానీ స్టోక్స్‌ రన్స్‌ తీశాడు. దీని ప్రకారం మోర్గాన్‌ స్టోక్స్‌కు వ్యతిరేకంగా లార్డ్స్‌ బయట ధర్నా చేయాలి.. అంతేగాక మోర్గాన్‌ ఒక కెప్టెన్‌గా ట్రోఫీని అందుకోవడానికి నిరాకరించాలి.. న్యాయబద్ధంగా న్యూజిలాండ్‌కు ట్రోఫీ అందించాలి. మరి మోర్గాన్‌ అప్పుడు అలా ఎందుకు చేయలేదు.. పైగా ఇప్పుడేమో అశ్విన్‌ను తప్పుబడుతూ ఆగ్రహం వ్యక్తం చేయడం ఎంతవరకు న్యాయం చెప్పండి'' అంటూ వ్యంగ్యంగా స్పందించాడు. ప్రస్తుతం సెహ్వాగ్‌ చేసిన ట్వీట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

చదవండి: IPL 2021: ఫామ్‌లో లేకపోతే అంతే.. మూలకు కూర్చోవాల్సిందే

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top