
దుబాయ్: ఐపీఎల్‌లో ఆటగాళ్లు ఎవరైనా ‘బయో బబుల్’ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి వ్యాఖ్యానించాడు. ఒక్కరి చిన్న తప్పు మొత్తం టోర్నీపైనే ప్రభావం చూపే ప్రమాదం ఉందని అతను అన్నాడు. జట్టు కోచ్ సైమన్ కటిచ్, టీమ్ డైరెక్టర్ మైక్ హెసన్ తదితరులతో కలిసి కోహ్లి జూమ్ మీటింగ్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అతను తన సహచరులకు హెచ్చరిక జారీ చేశాడు.
‘కరోనా కారణంగా ప్రస్తుతం విధించిన కఠినమైన నిబంధలను పాటించడంలో ఎవరూ ఉదాసీనతకు తావు ఇవ్వరాదు. పొరపాటున ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వారిని జట్టు నుంచి తొలగించడంతో పాటు వారం రోజులు క్వారంటైన్‌కు పంపిస్తాం. నెగెటివ్ వచ్చాకే మళ్లీ రానిస్తాం. అదే ఎవరైనా కావాలని నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఆటగాళ్లు ఈ చర్యలు అంగీకారమంటూ ముందే సంతకం చేయాల్సి ఉంటుంది’ అని కోహ్లి కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు.