పర్యవేక్షించనున్న బ్రిటన్‌ ఆరోగ్య శాఖ

 UK Health Department To Administer Covid Vaccine 2nd Dose For Kohli And Co - Sakshi

ముంబై: ప్రపంచ టెస్ట్ ఛాంపియ‌న్‌షిప్ ఫైనల్‌తో పాటు రూట్‌ సేనతో ఐదు టెస్టుల సిరీస్‌ ఆడేందుకు ఇంగ్లండ్‌కు వెళ్లనున్న కోహ్లీ సేనకు కోవిడ్‌ వ్యాక్సిన్‌ రెండో డోసును అక్కడే ఇచ్చేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం అంగీకరించింది. ఈ ప్రక్రియ మొత్తాన్ని యూకే ఆరోగ్య శాఖ పర్యవేక్షించనున్నట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. దీంతో వ్యాక్సిన్‌ తొలి డోసును భారత్‌లో తీసుకున్న కోహ్లి అండ్‌ కో, రెండో డోసును ఇంగ్లండ్‌లో తీసుకోనుంది.

18 ఏళ్ల దాటిన వారు కోవిడ్‌ టీకాను తీసుకోవచ్చని భారత ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన నేపథ్యంలో ఇంగ్లండ్‌ పర్యటనకు ఎంపికైన ఆటగాళ్లంతా తప్పనిసరిగా టీకా తీసుకోవాలని బీసీసీఐ ప్రకటించింది. దీంతో కెప్టెన్ విరాట్ కోహ్లితో సహా ఇత‌ర ఆట‌గాళ్లంతా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్ వెళ్లే ఆట‌గాళ్ల‌కు మూడు సార్లు ఆర్టీ పీసీఆర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన అనంతరం నెగిటివ్‌ రిపోర్ట్‌ వస్తేనే ఫ్లైట్‌ ఎక్కేందుకు అనుమతిస్తామని బీసీసీఐ ప్రకటించింది. 

కాగా, రెండు వారాల క్వారెంటైన్‌ నిమిత్తం ఇదివరకే ముంబై చేరుకున్న భారత బృందం.. ఇంగ్లండ్‌కు వెళ్లాక అక్క‌డ కూడా ప‌ది రోజులు క్వారెంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. మరోవైపు టీమిండియాకు బ్రిటన్‌ ప్రభుత్వం కాస్త ఉపశమనం కలిగించింది. జట్టు సభ్యులను కఠిన క్వారంటైన్ నిబంధనల నుంచి మినహాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
భారత టెస్టు జట్టు: విరాట్ కోహ్లి (కెప్టెన్), రహానే (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, శుభమన్ గిల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, హనుమ విహారి, రిషబ్ పంత్ (కీపర్), అశ్విన్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్ధూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్
స్టాండ్‌బై ప్లేయర్లు: అభిమన్యు ఈశ్వరన్, ప్రసీద్ద్‌ క్రిష్ణ, అవేష్ ఖాన్, అర్జాన్ నాగ్వాస్వాల్లా
చదవండి: రిటైర్మెంటే ఫైనల్‌: ఏబీ డివిలియర్స్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top