అదరహో... దేవేంద్ర, సుందర్‌

Tokyo Paralympics: Devendra Jhajharia Wins Javelin Silver, Bronze For Sundar Singh Gurjar - Sakshi

పారాలింపిక్స్‌ జావెలిన్‌ త్రోలోనే భారత్‌కు మరో రెండు పతకాలు లభించాయి. పురుషుల ఎఫ్‌–46 కేటగిరీలో పోటీపడిన రాజస్తాన్‌ జావెలిన్‌ త్రోయర్లు దేవేంద్ర ఝఝారియా రజతం సాధించగా... సుందర్‌ సింగ్‌ గుర్జర్‌ కాంస్య పతకాన్ని గెల్చుకున్నాడు. 40 ఏళ్ల దేవేంద్ర బల్లెంను 64.35 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో... 25 ఏళ్ల సుందర్‌ సింగ్‌ బల్లెంను 64.01 మీటర్ల దూరం విసిరి మూడో స్థానంలో నిలిచారు. పారాలింపిక్స్‌లో దేవేంద్రకిది మూడో పతకం కావడం విశేషం. 2004 ఏథెన్స్‌ పారాలింపిక్స్‌ లో, 2016 రియో పారాలింపిక్స్‌లో దేవేంద్ర స్వర్ణ పతకాలు గెలిచాడు.

వినోద్‌కు నిరాశ
మరోవైపు ఆదివారం పురుషుల డిస్కస్‌ త్రో ఎఫ్‌–52 విభాగంలో కాంస్యం గెలిచిన వినోద్‌ కుమార్‌పై నిర్వాహకులు అనర్హత వేటు వేశారు. వినోద్‌ వైకల్యం వర్గీకరణ జాబితాలో లేదని అతని ప్రత్యర్థులు ఫిర్యాదు చేయడంతో సోమవారం నిర్వాహకులు దీనిపై సమీక్షించారు. చివరకు వినోద్‌ వైకల్యం వర్గీకరణ జాబితాలో లేకపోవడంతో అతని ఫలితాన్ని రద్దు చేసి కాంస్య పతకాన్ని వెనక్కి తీసుకున్నారు.

యోగేశ్‌ అద్భుతం...
పురుషుల డిస్కస్‌ త్రో ఎఫ్‌–56 విభాగంలో భారత అథ్లెట్‌ యోగేశ్‌ కథునియా రజత పతకం సాధించాడు. తొలిసారి పారాలింపిక్స్‌లో బరిలోకి దిగిన 24 ఏళ్ల యోగేశ్‌ డిస్క్‌ను చివరిదైన ఆరో ప్రయత్నంలో 44.38 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచాడు. క్లాడినె బటిస్టా (బ్రెజిల్‌–45.59 మీటర్లు) స్వర్ణం, లియోనార్డో దియాజ్‌ (క్యూబా–43.36 మీటర్లు) కాంస్యం సాధించారు. మరోవైపు పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఎస్‌హెచ్‌–1 కేటగిరీలో భారత షూటర్‌ స్వరూప్‌ ఉన్హాల్కర్‌ నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకున్నాడు. మహారాష్ట్రకు చెందిన స్వరూప్‌ 203.9 పాయింట్లు స్కోరు చేశా>డు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top