Tokyo Olympics: 400 మీ హార్డిల్స్‌లో నార్వే అథ్లెట్‌ ప్రపం‍చరికార్డు

Tokyo Olympics: Warholm Destroys World Record To Win 400m Hurdles Gold - Sakshi

టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా 400 మీటర్ల హార్డిల్స్‌ ఫైనల్‌ రేసులో నార్వేకు చెందిన కార్‌స్టెన్‌ వార్లోమ్‌ చరిత్ర సృష్టించాడు. మంగళవారం జరిగిన 400 మీ హార్డిల్స్‌ ఫైనల్స్‌లో వార్లోమ్‌ 45.94 సెకండ్లలో గమ్యాన్ని చేరుకొని స్వర్ణం సాధించడమేగాక  ప్రపంచరికార్డు నమోదు చేశాడు. ఇంతకముందు  1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లో 400 మీటర్ల హార్డిల్స్‌ రేసులో కెవిన్‌ యంగ్‌ 46.70 సెకండ్లతో గమ్యాన్ని చేరుకొని స్వర్ణం సాధించాడు. తాజాగా వార్లోమ్‌ కెవిన్‌ యంగ్‌ రికార్డును బద్దలు కొట్టి చరిత్ర సృష్టించాడు.

అంతేకాదు 400 మీటర్ల హార్డిల్స్‌లో వార్లోమ్‌ తన రికార్డును తానే బద్దలు కొట్టడం విశేషం. సరిగ్గా నెల రోజుల క్రితం ఓస్లో వేదికగా జరిగిన ఈవెంట్‌లో 400 మీటర్ల హార్డిల్స్‌లో 46.70 సెకండ్లలో గమ్యాన్ని చేరుకొని కెవిన్‌ యంగ్‌తో సమానంగా నిలిచాడు. ఇక ఒలింపిక్స్‌లోనూ 400 మీటర్ల హార్డిల్స్‌ హీట్‌ విభాగంలోనూ మంచి ప్రదర్శన కనబరిచిన వార్లోమ్‌ తాజాగా ఫైనల్స్‌లో ఏకంగా ప్రపంచరికార్డు నమోదు చేసి స్వర్ణం కొల్లగొట్టాడు. ఇక అమెరికాకు చెందిన రాయ్‌ బెంజమిన్‌ 46.17 సెకండ్లతో రజతం.. బ్రెజిల్‌కు చెందిన అలిసన్‌ దాస్‌ సాంటోస్‌ 46.72 సెకండ్లతో కాంస్యం దక్కించుకున్నాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top