Parthiv Patel: తండ్రి కన్నుమూత.. పార్థివ్‌ భావోద్వేగ పోస్టు

Team India Former Cricketer Parthiv Patel Father Passed Away - Sakshi

టీమిండియా మాజీ క్రికెటర్‌ పార్థివ్‌ పటేల్‌ ఇంట్లో విషాదం

Parthiv Patel Father Passed Away: టీమిండియా మాజీ క్రికెటర్‌ పార్థివ్‌ పటేల్‌ నివాసంలో విషాదం నెలకొంది. అతడి తండ్రి అజయ్‌భాయ్‌ బిపిన్‌చంద్ర పటేల్‌ ఆదివారం కన్నుమూశారు. ఈ విషయాన్ని పార్థివ్‌ పటేల్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు. ‘‘మా నాన్న అజయ్‌భాయ్‌ బిపిన్‌చంద్ర పటేల్‌ నేడు(సెప్టెంబరు 26) స్వర్గస్తులైనారని తెలియజేసేందుకు చింతిస్తున్నాం. తీవ్ర విషాదంలో మునిగిపోయాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించగలరు’’ అని అతడు ట్వీట్‌ చేశాడు.

ఈ క్రమంలో.. మాజీ క్రికెటర్లు ఆర్పీ సింగ్‌, ప్రజ్ఞాన్‌ ఓజా పార్థివ్‌ కుటుంబానికి సంతాపం తెలియజేశారు. అజయ్‌భాయ్‌ బిపిన్‌చంద్ర పటేల్‌ ఆత్మకు శాంతి చేకూరాలని పార్థించారు. కాగా కొంతకాలం క్రితం.. మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న పార్థివ్‌ తండ్రిని.. స్వస్థలం అహ్మదాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి ఆయన తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. 

కాగా సుదీర్ఘ కెరీర్‌ తర్వాత తాను అన్ని ఫార్మాట్‌ల నుంచి రిటైర్‌ అవుతున్నట్లు పార్థివ్‌ పటేల్‌ గతేడాది ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రపంచ క్రికెట్‌ మొత్తంలో అత్యంత చిన్న వయస్సులోనే వికెట్‌ కీపర్‌గా ఎదిగిన ఆటగాళ్లలో అతడిది తొలి స్థానం. ఇక టీమిండియా తరఫున పార్థివ్‌ 25 టెస్టుల్లో 934 పరుగులు సాధించాడు. ఇందులో 6 అర్ధ శతకాలు ఉన్నాయి. వికెట్‌ కీపర్‌గా 62 క్యాచ్‌లు పట్టిన అతడు 10 స్టంపింగ్‌లు చేశాడు. 38 వన్డేల్లో 736 పరుగులు చేశాడు. ఇందులో 4 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top