
టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ పార్థివ్ పటేల్ (Parthiv Patel)ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఎక్కువగా ఉండటం జట్టుకు మంచిదని.. అయితే, అదే సెలక్టర్లకు తలనొప్పిగా మారుతుందన్నాడు. ఈ క్రమంలో కొంతమంది నైపుణ్యాలున్న ఆటగాళ్లు కూడా బెంచ్‌కే పరిమితం అవుతారని.. అలాంటి వాళ్లు దురదృష్టవంతులేనని పేర్కొన్నాడు.
శ్రేయస్ అయ్యర్‌కు అన్యాయం
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నీకి భారత జట్టును ప్రకటించిన నాటి నుంచి బీసీసీఐ (BCCI) తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఇందులో ప్రధానంగా శ్రేయస్ అయ్యర్‌కు అన్యాయం జరిగిందనేది మాజీ క్రికెటర్ల వాదన. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించడంతో పాటు.. టీ20 ఫార్మాట్లోనూ మంచి ఫామ్‌లో ఉన్నా అతడిని ఎందుకు ఎంపిక చేయడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలో పార్థివ్ పటేల్ సైతం.. శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)కు మద్దతుగా నిలిచాడు. అతడిని ఆసియా కప్ ఆడే జట్టుకు ఎంపిక చేస్తే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. అయితే, కొన్నిసార్లు జట్టులో చోటు కోసం ఎదురుచూడక తప్పదని.. దురదృష్టం వెంట ఉంటే ఇలాంటివే జరుగుతాయని పేర్కొన్నాడు.
కొంతమంది దురదృష్టవంతులుగా..
‘‘టీమిండియాను ఎంపిక చేసిన ప్రతిసారి ఏదో ఒక రకంగా విమర్శలు రావడం సహజం. ఆసియా కప్ టోర్నీకి శివం దూబే, రింకూ సింగ్.. ఇద్దరినీ సెలక్టర్లు ఎంపిక చేశారు. వీరిద్దరూ ఎడమచేతి వాటం బ్యాటర్లే. ఈ క్రమంలోనే శ్రేయస్ అయ్యర్‌కు ఎందుకు స్థానం ఇవ్వలేదనే ప్రశ్నలు వస్తున్నాయి.
పోటీలో ఎక్కువ మంది ఉన్నపుడు కొంతమంది దురదృష్టవంతులుగా మిగిలిపోవాల్సి వస్తుంది. క్రికెట్ ఆడుతున్నపుడు ఒక్కోసారి అదృష్టం కూడా కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది మరి!.. ఏదేమైనా శ్రేయస్ అయ్యర్ మరికొన్నాళ్లు ఓపికగా వేచిచూడకతప్పదు’’ అని పార్థివ్ పటేల్ పేర్కొన్నాడు.
పాపం సెలక్టర్లు ఏం చేస్తారు?
అదే విధంగా.. ‘‘ప్రస్తుతం టీమిండియా సెలక్టర్లుగా ఉండటం అత్యంత కఠిన సవాలుతో కూడుకున్న పని. వారికి నా సానుభూతి. భారత్‌లో ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. అందుకే అతడికి ఎందుకు అవకాశం రాలేదు? ఇతడికి మాత్రమే ఎందుకు ఛాన్స్ ఇచ్చారనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతూనే ఉంటాయి’’అ అని పార్థివ్ పటేల్ చెప్పుకొచ్చాడు.
ఇక ప్రస్తుతం ఆసియా కప్ టోర్నీకి పదిహేను మంది సభ్యులను మాత్రమే సెలక్టర్లు ఎంపిక చేయగలరన్న పార్థివ్ పటేల్.. శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్, ఐపీఎల్-2025 ఆరెంజ్ క్యాప్ విజేత సాయి సుదర్శన్, పర్పుల్ క్యాప్ విజేత ప్రసిద్ కృష్ణలు కూడా ఈ జట్టులో ఉండేందుకు అర్హులని పేర్కొన్నాడు.
కాగా యూఏఈ వేదికగా సెప్టెంబరు 9- 28 వరకు ఆసియా కప్ టోర్నీ జరుగనుంది. ఈసారి పొట్టి ఫార్మాట్లో ఈ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఇందులో భారత్‌తో పాటు పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, ఒమన్, యూఏఈ, హాంకాంగ్ పాల్గొంటున్నాయి.
ఆసియా కప్ టీ20-2025 టోర్నీకి భారత జట్టు
సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.
రిజర్వు ప్లేయర్లు: ప్రసిద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్.