
టీమిండియా స్టార్ రింకూ సింగ్ (Rinku Singh) గురించి భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా (Aakash Chopra )ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఉత్తరప్రదేశ్ బ్యాటర్‌కు తుదిజట్టులో చోటు దక్కకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. యాజమాన్యం అతడిని ప్రధాన జట్టుకు ఎంపిక చేసినా.. ప్లేయింగ్ ఎలెవన్‌లో మాత్రం ఆడించకపోవచ్చని పేర్కొన్నాడు.
అదనపు బ్యాటర్‌గా
కాగా గత కొంతకాలంగా ఫామ్‌లో లేకపోయినా టీమిండియా సెలక్టర్లు రింకూ సింగ్ వైపు మొగ్గుచూపి.. ఆసియా కప్ టోర్నీకి ఎంపిక చేశారు. జట్టు ప్రకటన సందర్భంగా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం మాకు అదనపు బ్యాటర్‌గా రింకూ అందుబాటులో ఉన్నాడు’’ అని తెలిపాడు.
ఇదిలా ఉంటే.. సూపర్ ఫామ్‌లో ఉన్న శ్రేయస్ అయ్యర్‌ను కాదని.. రింకూను ఎంపిక చేయడంపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ టీ20 లీగ్‌లో ఆల్‌రౌండర్ ప్రతిభతో రాణిస్తూ విమర్శకులకు ఆటతోనే సమాధానమిస్తున్నాడు.
బెంచ్‌కే పరిమితం
ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాత్రం భిన్నంగా స్పందించాడు. ‘‘రింకూ సింగ్.. ఫినిషర్. కానీ ఆసియా కప్ టోర్నీలో అతడు బెంచ్‌కే పరిమితం కాకతప్పకపోవచ్చు. ఎందుకంటే.. శివం దూబేకు తుదిజట్టులో అవకాశం ఉంటే.. అతడుఏడో స్థానంలో బ్యాటింగ్‌కు రావొచ్చు. మరోవైపు.. హార్దిక్ పాండ్యా.. జితేశ్ శర్మ కూడా ఉండనే ఉన్నారు. మరి రింకూకు చోటెక్కడ ఉంటుంది’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.
కాగా సెప్టెంబరు 9- 28 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఆసియా కప్ టోర్నీ జరుగనుంది. భారత్ ఆతిథ్య దేశంగా వ్యవహరించనుండగా.. టీమిండియాతో పాటు పాకిస్తాన్, ఒమన్, యూఏఈ, బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గనిస్తాన్, హాంకాంగ్ జట్లు టైటిల్ కోసం పోటీపడనున్నాయి. ఈసారి టీ20 ఫార్మాట్లో ఈ టోర్నీని నిర్వహించనున్నారు.
ఆసియా కప్ టీ20-2025 టోర్నీకి భారత జట్టు
సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.
రిజర్వు ప్లేయర్లు: ప్రసిద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్.
చదవండి: సెన్స్ ఉందా?.. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఏంటి?: రాజస్తాన్ రాయల్స్ స్టార్