పదేసిన ఆకాశ్‌దీప్‌.. ఇంగ్లండ్‌పై టీమిండియా చారిత్రక విజయం | Team India Beat England By 336 Runs In 2nd Test, Check Out Match Highlights And Full Score Details Inside | Sakshi
Sakshi News home page

IND Vs ENG: పదేసిన ఆకాశ్‌దీప్‌.. ఇంగ్లండ్‌పై టీమిండియా చారిత్రక విజయం

Jul 6 2025 9:46 PM | Updated on Jul 7 2025 3:48 PM

Team India Beat England By 336 Runs In 2nd Test

ఎడ్జ్‌బాస్టన్‌ టెస్ట్‌లో టీమిండియా చారిత్రక విజయం సాధించింది. చివరి రోజు వరకు సాగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ 336 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. విదేశాల్లో భారత్‌కు ఇదే భారీ విజయం. ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్‌కు ఇదే తొలి విజయం (58 ఏళ్ల తర్వాత). 

ఈ వేదికపై భారత్‌ ఈ మ్యాచ్‌కు ముందు వరకు ఒక్క విజయం కూడా సాధించలేదు. 8 మ్యాచ్‌ల్లో ఏడింట ఓడి, ఓ మ్యాచ్‌ డ్రా చేసుకుంది. ఈ గెలుపుతో గిల్‌ ఎడ్జ్‌బాస్టన్‌లో విజయం సాధించిన తొలి ఆసియా కెప్టెన్‌గా కూడా రికార్డు నెలకొల్పాడు. 

608 పరుగల భారీ లక్ష్య ఛేదనలో 72/3 స్కోర్‌ వద్ద చివరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్‌ 271 పరుగుల వద్ద ఆలౌటైంది. ఆకాశ్‌దీప్‌ (21.2-2-99-6) నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లండ్‌ బ్యాటర్ల భరతం​ పట్టాడు. ఆకాశ్‌దీప్‌కు కెరీర్‌లో ఇదే తొలి ఐదు వికెట్ల ఘనత. తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు పడగొట్టిన ఆకాశ్‌దీప్‌ మొత్తంగా 10 వికెట్ల ఘనత కూడా సాధించాడు.

ఈ మ్యాచ్‌లో బుమ్రా స్థానంలో బరిలోకి దిగిన ఆకాశ్‌దీప్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసి టీమిండియా చారిత్రక విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. మిగతా భారత బౌలర్లలో సిరాజ్‌, ప్రసిద్ద్‌ కృష్ణ, రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌ తలో వికెట్‌ తీశారు. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లోనూ టాప్‌ స్కోరర్‌గా నిలిచిన జేమీ స్మిత్‌ (88) డ్రా కోసం విఫలయత్నం చేశాడు.

అంతకుముందు టీమిండియా 427/6 వద్ద రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ను డిక్లేర్ చేసింది. శుభ్‌‌‌‌‌‌‌‌మన్ గిల్ (162 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 13 ఫోర్లు, 8 సిక్సర్లతో 161) సెంచ‌రీతో చెల‌రేగ‌గా.. రవీంద్ర జడేజా (69 నాటౌట్‌‌), రిషబ్ పంత్ (65), కేఎల్ రాహుల్ (55) హాఫ్ సెంచ‌రీలతో రాణించారు.

దీనికి ముందు ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులకు ఆలౌటైంది. హ్యారీ బ్రూక్‌ (158), జేమీ స్మిత్‌ (184 నాటౌట్‌) భారీ శతకాలతో చెలరేగారు. భారత బౌలర్లలో సిరాజ్‌ 6, ఆకాశ్‌దీప్‌ 4 వికెట్లు తీశారు.

ఈ మ్యాచ్‌లో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులు చేసింది. కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ (269) భారీ డబుల్‌ సెంచరీతో రికార్డులు తిరగరాశాడు. యశస్వి జైస్వాల్‌ (87), రవీంద్ర జడేజా (89) సెంచరీలకు చేరువలో ఔటయ్యారు.

ఈ గెలుపుతో భారత్‌ ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది. తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్‌ భారత్‌పై విజయం సాధించింది. ఈ సిరీస్‌లో మూడో టెస్ట్‌ జులై 10 నుంచి ప్రతిష్టాత్మక లార్డ్స్‌ మైదానంలో జరుగనుంది. గిల్‌ కెప్టెన్సీలో భారత్‌కు ఇదే తొలి గెలుపు. 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement