T20 World Cup 2021 SL Vs Ban: అంచనాల్లేకుండా బరిలోకి.. వరుస విజయాలతో..

T20 World Cup 2021: Sri Lanka Beat Bangladesh By 5 Wickets - Sakshi

లంక... విజయ ఢంకా

బంగ్లాదేశ్‌పై ఐదు వికెట్లతో ఘనవిజయం అసలంక, రాజపక్స మెరుపులు  

సీనియర్ల గైర్హాజరీ... తరచూ కెప్టెన్సీలో మార్పులు... కొన్నేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్‌లో ఎదురవుతున్న దారుణ పరాభవాలు... ఇన్ని సమస్యలతో టి20 ప్రపంచకప్‌లో అడుగు పెట్టిన శ్రీలంక వరుస విజయాలతో అదరగొడుతోంది. క్వాలిఫయింగ్‌లో వరుసగా మూడు విజయాలు సాధించిన శ్రీలంక అదే జోరును సూపర్‌–12లోనూ కొనసాగించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన గ్రూప్‌–1 లీగ్‌ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఐదు వికెట్లతో ఘనవిజయం సాధించింది.   

షార్జా: ఏమాత్రం అంచనాలు లేకుండా... దాదాపుగా కొత్త ముఖాలతో... అంతగా అనుభవంలేని ఆటగాళ్లతో టి20 ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన శ్రీలంక  సూపర్‌ ఛేజ్‌తో సూపర్‌–12లో శుభారంభం చేసింది. బంగ్లాదేశ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో దసున్‌ షనక నాయకత్వంలోని శ్రీలంక ఐదు వికెట్లతో గెలిచింది. ఒకదశలో గెలిచేలా కనిపించిన బంగ్లాదేశ్‌ పేలవ ఫీల్డింగ్‌తో మ్యాచ్‌ను చేజార్చుకుంది. తొలుత బంగ్లాదేశ్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 171 పరుగులు చేసింది. నైమ్‌ (52 బంతుల్లో 62; 6 ఫోర్లు), ముష్ఫికర్‌ రహీమ్‌ (37 బంతుల్లో 57 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. ఛేదనలో శ్రీలంక 18.5 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 172 పరుగులు చేసింది.

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ చరిత్‌ అలసంక (49 బంతుల్లో 80 నాటౌట్‌; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), భానుక రాజపక్స (31 బంతుల్లో 53; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) జట్టుకు విజయాన్ని అందించారు.  టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌కు ఓపెనర్లు నైమ్, లిటన్‌ దాస్‌ (16; 2 ఫోర్లు) తొలి వికెట్‌కు 40 పరుగులు జోడిం చి శుభారంభం చేశారు. షకీబ్‌ (10; 2 ఫోర్లు) త్వరగా అవుటయ్యాడు. ఈ దశలో నైమ్, రహీమ్‌ మూడో వికెట్‌కు 73 పరుగులు జోడించి బంగ్లాదేశ్‌ను ఆదుకున్నారు. 

సూపర్‌ అసలంక... 
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక కుశాల్‌ పెరీరా (1) వికెట్‌ను తొలి ఓవర్‌లోనే కోల్పోయింది. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన అసలంక బౌండరీతో ఖాతా తెరిచాడు. నసుమ్‌ వేసిన బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదిన అతడు... ముస్తఫిజుర్‌ ఓవర్‌లోనూ రెండు బౌండరీలు సాధించాడు. మరో ఎండ్‌లో నిసంక (21 బంతుల్లో 24; 1 ఫోర్, 1 సిక్స్‌) నిలకడగా ఆడటంతో శ్రీలంక లక్ష్యం వైపు సాగింది. అయితే 9వ ఓవర్‌లో బౌలింగ్‌కు వచ్చిన షకీబ్‌ రెండు బంతుల వ్యవధిలో నిసంక, అవిష్క ఫెర్నాండో (0)లను అవుట్‌ చేసి శ్రీలంకను ఒత్తిడి లోకి నెట్టాడు. మరికాసేపటికే హసరంగ (6) కూడా అవుటవ్వడంతో శ్రీలంక కష్టాల్లో పడింది. క్రీజులోకి వచ్చిన రాజపక్స వచ్చీ రావడంతోనే భారీ షాట్లతో బంగ్లా బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

సైఫుద్దీన్‌ వేసిన 16వ ఓవర్‌ తొలి మూడు బంతులను 6, 6, 4 బాదిన అతడు ఆఖరి బంతిని కూడా ఫోర్‌ కొట్టడంతో ఆ ఓవర్‌లో ఏకంగా 22 పరుగులు వచ్చాయి. ఈ క్రమంలో రాజపక్స 28 బంతుల్లో, 32 బంతుల్లో అసలంక అర్ధ సెంచరీలు చేశారు. చివర్లో రాజపక్స అవుటైనా... ఆఖరి వరకు నిలిచిన అసలంక ఫోర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. రాజపక్స 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద, అసలంక 63 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఇచ్చిన క్యాచ్‌ లను లిటన్‌ దాస్‌ జారవిడవడం బంగ్లాదేశ్‌ విజయావకాశాలను దెబ్బతీసింది. బంగ్లాదేశ్‌ తన తదుపరి మ్యాచ్‌ను 27న ఇంగ్లండ్‌తో; శ్రీలంక తన తదుపరి మ్యాచ్‌ను ఈనెల 28న ఆస్ట్రేలియాతో ఆడతాయి. 

టి20 ప్రపంచకప్‌ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా బంగ్లాదేశ్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ (28 మ్యాచ్‌ల్లో 41 వికెట్లు) అవతరించాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో షకీబ్‌ రెండు వికెట్లు తీయడంద్వారా 39 వికెట్లతో ఇప్పటిదాకా పాకిస్తాన్‌ ప్లేయర్‌ షాహిద్‌ అఫ్రిది పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు.   

స్కోరు వివరాలు 
బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌: నైమ్‌ (సి అండ్‌ బి) బినుర ఫెర్నాండో 62; లిటన్‌ దాస్‌ (సి) షనక (బి) లహిరు కుమార 16; షకీబ్‌ (బి) చమిక కరుణరత్నే 10; ముషి్ఫకర్‌ (నాటౌట్‌) 57; అఫిఫ్‌ (రనౌట్‌) 7; మహ్ముదులా (నాటౌట్‌) 10; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 171.  
వికెట్ల పతనం: 1–40, 2–56, 3–129, 4–150. బౌలింగ్‌: చమిక కరుణరత్నే 3–0–12–1, బినుర ఫెర్నాండో 3–0–27–1, దుష్మంత చమీర 4–0–41–0, లహిరు కుమార 4–0–29–1, చరిత్‌ అసలంక 1–0–14–0, హసరంగ 3–0–29–0, షనక 2–0–14–0. 

శ్రీలంక ఇన్నింగ్స్‌: పెరీరా (బి) నసుమ్‌ అహ్మద్‌ 1; నిసంక (బి) షకీబ్‌ 24; అసలంక (నాటౌట్‌) 80; అవిష్క ఫెర్నాండో (బి) షకీబ్‌ 0; హసరంగ (సి) నైమ్‌ (బి) సైఫుద్దీన్‌ 6; భానుక రాజపక్స (బి) నసుమ్‌ అహ్మద్‌ 53; షనక (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (18.5 ఓవర్లలో 5 వికెట్లకు) 172.  
వికెట్ల పతనం: 1–2, 2–71, 3–71, 4–79, 5–165.  బౌలింగ్‌: నసుమ్‌ అహ్మద్‌ 2.5–0–29–2, మెహదీ హసన్‌ 4–0–30–0, సైఫుద్దీన్‌ 3–0–38–1, షకీబ్‌ 3–0–17–2, ముస్తఫిజుర్‌ 3–0–22–0, మహ్ముదుల్లా 2–0–21–0, అఫిఫ్‌ 1–0–15–0.   

చదవండి: Virat Kohli: వాళ్లు బాగా ఆడారు.. అయినా ఇదే చివరి మ్యాచ్‌ కాదు కదా

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top