నేను తప్పు చేయలేదు..సిగ్గు చేటు: స్మిత్‌

Steve Smith Denied Cheating Accusations Of Scuffing Rishabh Pant Batting Guard - Sakshi

బ్రిస్బేన్‌: మూడో టెస్టులో పంత్‌ బ్యాటింగ్‌ గార్డ్‌ మార్క్‌ను ఉద్దేశపూర్వకంగా చెరిపేశాడంటూ తనపై వస్తున్న విమర్శలపై ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ స్పందించాడు. అసలు ఇందులో ఎలాంటి వివాదమే లేదని అతను స్పష్టం చేశాడు. ‘తాజా ఆరోపణలతో నేను నిర్ఘాంతపోయా. చాలా నిరాశ చెందాను కూడా. సాధారణంగా పిచ్‌ వద్దకు వెళ్లి మా బౌలర్లు ఎక్కడ బంతులు వేస్తున్నారు. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ ఎలా ఆడుతున్నారు అనేది అక్కడ నిలబడి ఒక దృశ్యాన్ని నా మదిలో ఊహించుకుంటా. అప్రయత్నంగా మిడిల్‌ స్టంప్‌కు అనుగుణంగా ఒక మార్కింగ్‌ కూడా చేసుకోవడం నాకు అలవాటు. అంతే గానీ నేనేమీ కావాలని చేయలేదు. భారత జట్టు అద్భుత ప్రదర్శన కాకుండా ఇలాంటి విషయాలకు ప్రాధాన్యత దక్కడం సిగ్గు పడాల్సిన అంశం’ అని స్మిత్‌ తనను తాను సమర్థించుకున్నాడు. చదవండి: స్టీవ్‌ స్మిత్‌..  మళ్లీ చీటింగ్‌ చేశాడు..!

మరో వైపు సుదీర్ఘ కాలంగా స్మిత్‌ ఆటను చూసినవారికి ఇది అతను ఎప్పుడూ చేసే పనేనని అర్థమవుతుందన్న ఆసీస్‌ కెప్టెన్‌ పైన్‌... నిజంగా పంత్‌ మార్కింగ్‌ను చెరిపేస్తే భారత జట్టు అధికారికంగా ఫిర్యాదు చేసే ఉండేదని అభిప్రాయ పడ్డాడు. మైదానంలో అశ్విన్‌తో తాను వ్యవహరించిన తీరు పట్ల పైన్‌ క్షమాపణ కోరాడు. తాను కెప్టెన్‌గా విఫలమయ్యానని, ఒక ‘ఫూల్‌’లా వ్యవహరించానని చెప్పిన ఆసీస్‌ కెప్టెన్‌... ఆట ముగియగానే అశ్విన్‌తో మాట్లాడి తప్పు సరిదిద్దుకున్నట్లు వెల్లడించాడు. చదవండి: ఆసీస్‌ స్టార్‌ ఆటగాడిపై వేటు!

మూడో స్థానానికి కోహ్లి
దుబాయ్‌: సిడ్నీలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచిన స్టీవ్‌ స్మిత్‌ ఐసీసీ టెస్టు బ్యాట్స్‌మన్‌ ర్యాంకింగ్స్‌లో ఒక స్థానాన్ని మెరుగు పర్చుకొని రెండో స్థానానికి (900 పాయింట్లు) చేరుకున్నాడు. అతని తాజా ప్రదర్శనతో విరాట్‌ కోహ్లి (870) మూడో స్థానానికి పడిపోగా...కేన్‌ విలియమ్సన్‌ (911) తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. మూడో టెస్టులో రాణించిన పుజారా రెండు స్థానాలు ఎగబాకి ఎనిమిదో ర్యాంక్‌లో నిలవగా... రహానే ఆరునుంచి ఏడో స్థానానికి పడిపోయాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top