Sreesanth: కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్న శ్రీశాంత్‌

Sreesanth Named As Mentor For Bangla Tigers In Abu Dhabi T10 League - Sakshi

టీమిండియా మాజీ బౌలర్‌, వివాదాస్పద ఆటగాడు శాంతకుమరన్‌ శ్రీశాంత్‌ త్వరలో మరో కొత్త ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టనున్నాడు. ఈ ఏడాది చివర్లో (నవంబర్‌) ప్రారంభమయ్యే అబుదాబీ టీ10 లీగ్‌ నుంచి మెంటర్‌గా కెరీర్‌ను ప్రారంభించనున్నాడు. బంగ్లా స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ సారధ్యం వహించనున్న బంగ్లా టైగర్స్‌కు శ్రీశాంత్‌ తన సేవలందించనున్నాడు. 

ఈ జట్టుకు హెడ్‌ కోచ్‌గా బంగ్లా మాజీ ఆల్‌రౌండర్‌ ఆఫ్తాబ్‌ అహ్మద్‌ వ్యవహరించనుండగా.. అదే దేశానికే చెందిన నజ్ముల్‌ అబెదిన్‌ ఫహీమ్‌ అసిస్టెంట్ కోచ్‌గా పని చేయనున్నాడు. ఈ ఇద్దరితో కలిసి శ్రీశాంత్‌ కోచింగ్‌ టీమ్‌లో ఉంటాడని బంగ్లా టైగర్స్‌ యాజమాన్యం శనివారం వెల్లడించింది. 

కాగా, అబుదాబీ ఐదో సీజన్‌ కోసం బంగ్లా టైగర్స్‌ కీలక మార్పులు చేసింది. ఐకాన్‌ ప్లేయర్‌ కోటాలో షకీబ్‌ను కెప్టెన్‌గా ఎంచుకోవడంతో పాటు విధ్వంసకర ఆటగాళ్లు ఎవిన్‌ లూయిస్‌ (వెస్టిండీస్‌), కొలిన్‌ మన్రో (న్యూజిలాండ్‌).. స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ అమీర్‌ (పాకిస్థాన్‌), శ్రీలంక యువ సంచలనం మతీశ పతిరణను జట్టులో చేర్చుకుంది. సఫారీ స్టార్‌ ఆటగాడు డుప్లెసిస్‌ సారధ్యంలో గత సీజన్‌ బరిలో నిలిచిన బంగ్లా టైగర్స్‌ మూడో స్థానంలో నిలిచింది. 

ఇదిలా ఉంటే, ఈ ఏడాది మార్చిలో క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన శ్రీశాంత్‌.. తొలిసారి కోచింగ్‌ డిపార్ట్‌మెంట్‌లో చేరాడు. గతంలో టీమిండియా క్రికెటర్‌గా, సినిమాల్లో హీరోగా నటించిన ఈ కేర‌ళ స్పీడ్‌స్టర్‌.. త్వరలో సరికొత్త అవతారంలో క్రికెట్‌ ఫ్యాన్స్‌ ముందుకు రానున్నాడు. ఐపీఎల్‌ (2013 సీజన్‌) స్పాట్ ఫిక్సింగ్ కేసు‌లో దోషిగా తేల‌డంతో శ్రీశాంత్‌ కెరీర్‌కు అర్థంతరంగా ముగిసిన విషయం తెలిసిందే. 2022 ఐపీఎల్ వేలంలో కనీస ధర యాభై లక్షలకు తన పేరును నమోదు చేసుకున్న శ్రీశాంత్‌ను ఏ ఫ్రాంచైజ్ కొనుగోలు చేయలేదు.
చదవండి: భారత్‌-పాక్‌ మ్యాచ్‌.. కత్తులు దూసుకున్న బుడ్డోళ్లు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top