ఫిఫా ప్రపంచకప్-2026 టోర్నీలో దక్షిణ కొరియా శుభారంభం అందుకుంది. తమ తొలి మ్యాచ్‌లో చెక్ రిపబ్లిక్‌ను 2-1తో ఓడించింది. 80వ నిమిషం వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఆఖరికి దక్షిణ కొరియానే పైచేయి సాధించింది.
నువ్వా- నేనా..
మెగా టోర్నీలోని రెండో మ్యాచ్‌లో భాగంగా మెక్సికోలోని గ్వడాలజారా స్టేడియంలో దక్షిణ కొరియా- చెక్ రిపబ్లిక్ శుక్రవారం ఉదయం తలపడ్డాయి. మ్యాచ్ తొలి అర్ద భాగంలో ఇరుజట్లు నువ్వా-నేనా అన్నట్లుగా పోటీపడ్డాయి. చెక్ రిపబ్లిక్ దూకుడు ప్రదర్శించగా.. దక్షిణా కొరియా ఎప్పుటికప్పుడు ప్రత్యర్థికి చెక్ పెడుతూ వచ్చింది.
తొలి అర్ధ భాగంలో నో గోల్
ఫలితంగా తొలి అర్ధ భాగం ఒక్క గోల్ కూడా లేకుండానే 0-0తో ముగిసింది. రెండో అర్ద భాగంలో దక్షిణ కొరియా నెమ్మదిగా చెక్ రిపబ్లిక్‌పై ఒత్తిడి పెంచుతూ పోయింది. 49వ నిమిషంలో జేఎస్ లీ గోల్‌కు యత్నించగా చెక్ గోల్ కీపర్ కొవార్ అడ్డుకున్నాడు. అయితే, 56వ నిమిషంలో లీ మరోసారి ప్రయత్నించగా చేదు అనుభవమే ఎదురైంది.
ఆనందం ఆవిరి
ఈ క్రమంలో 58వ నిమిషంలో లాడిస్లావ్ అద్భుతంగా గోల్ కొట్టడంతో చెక్ రిపబ్లిక్ 1-0తో ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. అయితే, ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. 67వ నిమిషంలో దక్షిణ కొరియా ఆటగాడు వాంగ్ ఇన్ బోయెమ్ గోల్ కొట్టి స్కోరును 1-1తో సమం చేశాడు. అంతర్జాతీయ కెరీర్‌లో అతడికి ఇదే తొలి గోల్ కావడం విశేషం.
ఇరుజట్లు సమంగా ఉన్న వేళ 77వ నిమిషంలో చెక్ రిపబ్లిక్ గోల్‌కు యత్నించి విఫలమైంది. ఆ వెంటనే అంటే 80వ నిమిషంలో ఓ హేయాన్ గ్యూ గోల్ కొట్టడంతో దక్షిణ కొరియా 2-1తో ఆధిక్యాన్ని పెంచుకుంది.
అనంతరం చెక్ రిపబ్లిక్ గోల్ కొట్టేందుకు ప్రయత్నించగా.. కొరియా గోల్ కీపర్ ఎస్‌జీ కిమ్ అడ్డుగోడలా నిలబడి వారి ఆశలపై నీళ్లు చల్లాడు. హెచ్‌ఎమ్ సన్ అద్భుత రీతిలో ప్రత్యర్థికి కౌంటర్ అటాక్‌లు ఇచ్చాడు. అలా ఆఖరి వరకు దక్షిణా కొరియా చెక్ రిపబ్లిక్‌ను కోలుకోనివ్వలేదు. ఫలితంగా 2-1తో విజయం కొరియా సొంతమైంది. ఇక ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య మెక్సికో సౌతాఫ్రికాపై గెలుపొందింది.


