చరిత్ర సృష్టించిన గిల్.. దశాబ్దంలో తొలి ఆటగాడు | Shubman Gill Completes 3,000 Test Runs And Becomes India’s 28th Batter To Reach Milestone, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన గిల్.. దశాబ్దంలో తొలి ఆటగాడు

Aug 23 2026 12:17 PM | Updated on Aug 23 2026 2:44 PM

SHUBMAN GILL COMPLETED 3000 RUNS IN TEST CRICKET

source: BCCI X

భారత టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మరో కీలక మైలురాయిని తాకాడు. టెస్ట్ క్రికెట్‌లో 3,000 పరుగులు పూర్తి చేశాడు. తద్వారా ఈ ఘనత సాధించిన 28వ భారత బ్యాటర్‌గా నిలిచాడు. కొలొంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో గిల్‌ ఈ ఘనత సాధించాడు.

26 ఏళ్ల గిల్ తన 43వ మ్యాచ్‌ 77వ ఇన్నింగ్స్‌లో 3000 పరుగుల మార్కును తాకాడు. ఈ ఫార్మాట్‌లో గిల్‌ 43.53 సగటున, 8 సెంచరీలు, 11 అర్ద సెంచరీలు చేశాడు. అతడి అత్యుత్తమ స్కోర్‌ 269గా ఉంది.

కపిల్‌ కంటే వారం ముందు..
టెస్ట్‌ల్లో 3000 పరుగుల మైలురాయిని గిల్‌ 26 ఏళ్ల 349 రోజుల వయసులో అందుకున్నాడు. తద్వారా భారత్‌ తరఫున అత్యంత పిన్న వయసులో ఈ మైలురాయిని తాకిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. 

ఈ జాబితాలో సచిన్‌ టెండూల్కర్‌ (23 ఏళ్ల 228 రోజుల) అగ్రస్థానంలో ఉండగా.. వీరేంద్ర సెహ్వాగ్‌ (26 ఏళ్ల 157 రోజులు), దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ (26 ఏళ్ల 263 రోజులు) రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. గిల్‌.. భారత దిగ్గజ ఆల్‌రౌండర్‌ కపిల్‌ దేవ్‌ (26 ఏళ్ల 356 రోజులు) కంటే వారం రోజుల ముందు ఈ మైలురాయిని తాకాడు.

2020లో టెస్ట్ అరంగేట్రం చేసిన గిల్‌.. నాటి నుంచే నిలకడైన ప్రదర్శనలతో భారత టెస్ట్ జట్టులో కీలక బ్యాటర్‌గా ఎదిగాడు. ముఖ్యంగా 2025లో ఇంగ్లండ్ పర్యటనలో అతడి బ్యాటింగ్ అత్యంత ప్రభావవంతంగా నిలిచింది. ఆ సిరీస్‌లో గిల్ ఏకంగా 754 పరుగులు సాధించాడు. గిల్‌ వన్డేల్లోనూ ఇదివరకే 3000 పరుగులు పూర్తి చేశాడు.

దశాబ్దంలో తొలి ఆటగాడు
ఈ మ్యాచ్‌లో గిల్ మరో అరుదైన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ దశాబ్దంలో టెస్టులు, వన్డేలు రెండింటిలో కనీసం 3,000 పరుగులు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. గిల్‌ ఇటీవల ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో 3,000 వన్డే పరుగులు పూర్తి చేశాడు. కేవలం 62 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని అందుకుని, వన్డే చరిత్రలో అత్యంత వేగంగా 3,000 పరుగులు సాధించిన ఆటగాళ్లలో రెండో స్థానంలో నిలిచాడు. 

మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న భారత్‌ తొలి రోజు లంచ్‌ విరామం సమయానికి 2 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్‌(45), కేఎల్‌ రాహుల్‌ (18) ఔట్‌ కాగా.. పడిక్కల్‌ (13), గిల్‌ (11) క్రీజ్‌లో ఉన్నారు. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్‌ తొలి మ్యాచ్‌లో గెలిచిన విషయం తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement