భారత పురుషల క్రికెట్ జట్టు ఈ ఏడాది జూలైలో జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లో భాగంగా ఆతిథ్య జట్టుతో టీమిండియా మూడు టీ20ల సిరీస్‌లో తలపడనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను జింబాబ్వే క్రికెట్ బోర్డు బుధవారం విడుదల చేసింది. ఈ సిరీస్ జూలై 23న ప్రారంభమై జూలై 26తో ముగిస్తుంది.
అన్ని మ్యాచ్‌లు హరారే వేదికగా జింబాబ్వే వేదికగానే జరగనున్నాయి.భారత్, జింబాబ్వే మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరగనుండడం 2024 తర్వాత ఇదే తొలిసారి. అయితే అంతకంటే ముందు భారత జట్టు.. ఇంగ్లండ్, ఐర్లాండ్, అఫ్గానిస్తాన్‌లతో వైట్‌బాల్ సిరీస్‌లలో తలపడనుంది. అంతేకాకుండా జింబాబ్వే పర్యటన ముగిసిన వెంటనే టీమిండియా శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనుంది.
అయితే ఈ వరుస సిరీస్‌ల నేపథ్యంలో ఐర్లాండ్, జింబాబ్వే టూర్‌లకు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చే అవకాశముంది. ఈ సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ, అయూశ్ మాత్రే వంటి యువ ఆటగాళ్లకు చోటు దక్కేందుకు అస్కారం ముంది. ఐపీఎల్-2026లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచే యంగ్ క్రికెటర్లను కూడా సెలెక్టర్లు పరిగణలోకి తీసుకునే ఛాన్స్ ఉంది. ఏదేమైనప్పటికి 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి మాత్రం భారత సీనియర్ జట్టు తరపున పిలుపు రావడం దాదాపు ఖాయమన్పిస్తోంది.
కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్?
మరోవైపు గత కొంతకాలంగా కేవలం వన్డేలకు మాత్రమే పరిమితమైన శ్రేయస్ అయ్యర్ తిరిగి టీ20 జట్టులోకి వచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. ఇంగ్లండ్ టూర్ ముగిసిన తర్వాత టీమిండియా టీ20 రెగ్యులర్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తిరిగి స్వదేశానికి వచ్చే అవకాశముంది. సూర్య ప్రస్తుతం స్వల్ప గజ్జ గాయంతో బాధపడుతున్నాడు.
దీంతో అతడికి ముఖ్యమైన సిరీస్‌లోనే అతడిని ఆడించాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ భావిస్తుందంట. ఈ క్రమంలో ఐర్లాండ్ లేదా జింబాబ్వే టూర్‌లో భారత జట్టు పగ్గాలను శ్రేయస్ చేపట్టే అవకాశముందని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు. శ్రేయస్ చివరగా రెండేళ్ల కిందట టీమిండియా తరపున టీ20ల్లో ఆడాడు. లక్నో స్పీడ్ స్టార్ యయాంక్ యాదవ్‌ను కూడా తిరిగి టీ20 జట్టులోకి తీసుకోవాలని అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ భావిస్తుందంట.
చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ లెజెండ్


