పాక్‌ పేసర్‌కు చురకలంటించిన అక్తర్‌

Shoaib Akhtar Takes A Dig At Shaheen Afridis Post Wicket Celebration - Sakshi

Shoaib Akhtar On Afridi: ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న పాకిస్థాన్ జట్టుకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి రెండు వన్డేల్లో ఘోర పరాజయాలను మూటగట్టుకున్న పాక్‌, ఇప్పటికే సిరీస్‌ను కోల్పోయింది. ఈ నేపథ్యంలో పాక్‌ వైఫల్యాలపై ఆ జట్టు మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా పాక్‌ పేస్‌ విభాగానికి నాయకత్వం వహిస్తున్న షాహిన్‌ అఫ్రిదిపై ఆయన నిప్పులు చెరిగారు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి రెండు వన్డేల్లో కేవలం రెండు వికెట్లు మాత్రమే పడగొట్టిన షాహిన్‌.. వికెట్లు తీయడం కంటే ఫ్లైయింగ్ కిస్‌లకే ఎక్కువ సమయం కేటాయించాడని చురకలంటించాడు. 

ముద్దులు, కౌగిలింతలు పక్కకు పెట్టి, ముందు వికెట్లు ఎలా తీయాలో ఆలోచించాలని ఘాటుగా మందలించాడు. ఒక్క వికెట్ పడగొట్టగానే ఫ్లైయింగ్ కిస్‌లు పెట్టడంలో అర్ధం లేదని, ఐదు వికెట్ల ప్రదర్శన తర్వాత ఇలా చేస్తే బాగుంటుందని పంచ్‌ల వర్షం కురిపించాడు. సిరీస్‌కు ముందు సరిపడా సమయం లేదని సాకులు చెప్పి తప్పించుకోవడం సరికాదని హితవు పలికాడు. మ్యాచ్‌కు కేవలం రెండున్నర రోజులు ముందే ఇంగ్లండ్ జట్టు అక్కడికి వచ్చింది. వారు కలిసి జట్టుగా ఆడగలిగినప్పుడు మీకేమైందని నిలదీశాడు. ఇంగ్లండ్ అకాడమీ టీంతో ఓడిపోవడానికి సిగ్గు లేదా అని ఘాటుగా వ్యాఖ్యానించాడు. 

ఈ సందర్భంగా ఆయన పాక్‌ బ్యాటింగ్‌ లైనప్‌పై కూడా ధ్వజమెత్తాడు. బంతికి ఒక పరుగు చేయాల్సిన స్థితిలోనూ అంత కష్టపడడం ఏంటని ప్రశ్నించాడు. ఇది పాక్‌ జట్టు అత్యంత పేలవ ప్రదర్శన అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలానే ఆడితే భవిష్యత్తులో పాక్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు చూసేందుకు అభిమానులుండరన్నాడు. పాక్‌ పేలవ ప్రదర్శన ఇలానే కొనసాగితే బాబర్ ఆజం సారథ్యంలోని పాక్ జట్టు 3-0తో ఇంగ్లండ్ చేతిలో ఓడడం ఖాయమని జోస్యం చెప్పాడు. ఇదిలా ఉంటే, పాక్‌ జట్టు తొలి వన్డేలో 9 వికెట్ల తేడాతో, రెండో వన్డేలో 52 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ చేతిలో ఓటమిపాలైంది. ఇరు జట్ల మధ్య నామమాత్రమైన మూడో వన్డే రేపు బర్మింగ్‌హామ్‌లో జరుగనుంది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top