ఏడ్చేసిన షోయబ్‌ అక్తర్‌..! కాస్తైనా బుద్ధి లేదంటూ ఫ్యాన్స్‌ ఫైర్‌ | Ind vs Pak Bohot Kuch: Shoaib Akhtar Heartbroken By No Handshake Act | Sakshi
Sakshi News home page

ఏడ్చేసిన షోయబ్‌ అక్తర్‌..! కాస్తైనా బుద్ధి లేదంటూ ఫ్యాన్స్‌ ఫైర్‌

Sep 15 2025 1:13 PM | Updated on Sep 15 2025 2:20 PM

Ind vs Pak Bohot Kuch: Shoaib Akhtar Heartbroken By No Handshake Act

పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టుకు టీమిండియా (IND vs PAK) గట్టిగానే కౌంటర్‌ ఇచ్చింది. పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత ముఖాముఖి తలపడిన తొలి పోరులో దాయాదికి చుక్కలు చూపించింది. దుబాయ్‌ వేదికగా ఆసియా కప్‌-2025 (Asia Cup)లో సమిష్టి ప్రదర్శనతో రాణించి.. పాక్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది.

ఊహించని దెబ్బ
అయితే, ఆట పరంగానే కాకుండా.. నైతికంగానూ భారత జట్టు పాకిస్తాన్‌ను ఊహించని దెబ్బ కొట్టింది. మైదానంలో పాక్‌ ఆటగాళ్లతో కరచాలనం చేసేందుకు భారత ఆటగాళ్లు నిరాకరించారు. అంతేకాదు.. షేక్‌హ్యాండ్‌ కోసం మరోసారి ప్రయత్నం చేసినా డ్రెసింగ్‌రూమ్‌ తలుపులు మూసివేసినట్లు సమాచారం.

మంచిగానే బుద్ధి చెప్పారు
ఈ విషయంపై స్పందించిన టీమిండియా అభిమానులు.. ‘‘ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశానికి మంచిగానే బుద్ధి చెప్పారు’’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా భారత ఆటగాళ్లను సమర్థిస్తున్నారు. అయితే, పాకిస్తాన్‌ దిగ్గజ ఫాస్ట్‌ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ మాత్రం నో- షేక్‌హ్యాండ్‌ చర్యను జీర్ణించుకోలేకపోయాడు.

‘‘నాకేం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. నా మనసు ముక్కలైంది. హ్యాట్సాఫ్‌ ఇండియా. కానీ మీరు క్రికెట్‌ మ్యాచ్‌ను రాజకీయాల నుంచి వేరుగా ఉంచండి. మీ గురించి మేము ఎన్నో గొప్ప విషయాలు చెప్పాము.

అక్తర్‌ కంటతడి
అలాంటి మాకు ఈ నో-షేక్‌హ్యాండ్‌ చర్య గురించి కూడా ఏదైనా మాట్లాడే హక్కు ఉంటుంది. ప్రతి ఇంట్లోనూ గొడవలు జరుగుతూ ఉంటాయి. కానీ వాటినే గుర్తుపెట్టుకుని ఇలా చేయకూడదు. మరచిపోయి ముందుకు సాగిపోవాలి.

ఇది క్రికెట్‌. చేతులు కలపండి. కాస్త దయ చూపండి’’ అంటూ అక్తర్‌ కంటతడి పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ నేపథ్యంలో భారతీయ నెటిజన్లు అక్తర్‌కు దిమ్మతిరిగేలా కౌంటర్‌ ఇస్తున్నారు.

షేక్‌హ్యాండ్‌ ఇవ్వనందుకే ఇంత బాధగా ఉంటే..
‘‘అమాయకుల ప్రాణాలను పొట్టనబెట్టుకున్న ఉగ్రమూకల గురించి మర్చిపోవాలా?.. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా?.. షేక్‌హ్యాండ్‌ ఇవ్వనందుకే మీరు ఇంతగా బాధపడిపోతున్నారు.. తమ వారిని శాశ్వతంగా పోగొట్టుకున్న బాధితుల మనసులో ఎలాంటి అలజడి చెలరేగుతుందో మీరు కనీసం ఊహించగలరా?

మ్యాచ్‌ గెలవడమే కాదు.. ఇలా వారికి సరైన బుద్ధి చెప్పినందుకు టీమిండియాకు హ్యాట్సాఫ్‌. దెబ్బ అదుర్స్‌’’ అంటూ అక్తర్‌ తీరును ఏకిపారేస్తూ.. సూర్యకుమార్‌ సేనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా ఇటీవల కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు అమాయక పర్యాటకుల ప్రాణాలను పొట్టనబెట్టుకున్నారు.

ఇందుకు బదులుగా భారత ఆర్మీ ఆపరేషన్‌ సిందూర్‌ పేరిట పాక్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేసి ధ్వంసం చేసింది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పాకిస్తాన్‌ సైన్యం.. ఎదురుదాడికి ప్రయత్నించగా.. భారత్‌ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఆసియా కప్‌ టోర్నీలో టీమిండియా- పాక్‌ ముఖాముఖి తలపడటం గమనార్హం.

చదవండి: IND vs PAK: చరిత్ర సృష్టించిన అభిషేక్‌ శర్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement