
ఆసియాకప్-2025లో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. బౌలింగ్, బ్యాటింగ్‌లో దుమ్ములేపిన టీమిండియా దాయాది పాక్‌ను చావుదెబ్బ కొట్టింది. అయితే భారత్ చేతిలో ఓటమిని పాక్ మాజీ క్రికెటర్లు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
అంతేకాకుండా మ్యాచ్ అనంతరం భారత ఆటగాళ్లు పాకిస్తాన్ ప్లేయర్లతో కరచాలనం చేసేందుకు నిరాకరించారు. ఒకవైపు ఓటమి, మరోవైపు భారత్ చేసిన పనికి పాక్ మాజీ ఆటగాళ్లు ఘోర అవమానంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘాపై ఆ జట్టు మాజీ స్పీడ్ స్టార్ షోయబ్ అక్తర్ విమర్శల వర్షం కురిపించాడు. సల్మాన్ తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడాన్ని అక్తర్ తప్పుబట్టాడు.
"టాస్ సందర్భంగా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పిచ్ రిపోర్ట్ మొత్తం చెప్పాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం ఉండే అవకాశముందని, పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని అతడు అంచనా వేశాడు. మా బ్యాటింగ్ లైనప్ చాలా డెప్త్‌గా ఉంది.
మేం మొదట బౌలింగే చేయాలనుకున్నాం అని సూర్య స్పష్టంగా చెప్పాడు. కానీ మా ఐన్‌స్టీన్ (సల్మాన్ అలీ ఆఘా) మాత్రం పిచ్ గురించి ఏమీ తెలుసుకోకుండానే మేం మొదట బ్యాటింగ్ చేస్తాం అన్నాడు. అందుకు తగ్గ మూల్యం పాక్ చెల్లించుకుందని" అక్తర్ ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
అదేవిధంగా భారత్ ఆటగాళ్లు హ్యాండ్ షేక్ ఇవ్వడంపై కూడా అక్తర్ స్పందించాడు. "నాకు మాటలు రావడం లేదు. చాలా బాధగా ఉంది. గెలిచిన టీమిండియాకు శుభాకాంక్షలు. కానీ మీరు క్రికెట్ మ్యాచ్‌ను రాజకీయాల నుంచి వేరుగా ఉంచండి. మీ గురించి మేము ఎన్నో గొప్ప విషయాలు చెప్పాము. మేము ఈ నో షేక్ హ్యాండ్ చర్య గురించి మాట్లాడొచ్చు. ప్రతి ఇంట్లోనూ గొడవలు జరుగుతూ ఉంటాయి. కానీ వాటిని మరచిపోయి ముందుకు సాగిపోవాలి" అని అక్తర్ అన్నాడు.
చదవండి: పాకిస్తాన్‌తో ఆడితే తప్పు కాదా? షేక్ హ్యాండ్ ఇస్తేనే తప్పా?: మనోజ్ తివారీ