
ఆసియాకప్-2025లో పాకిస్తాన్ జట్టుతో సంప్రదాయ కరచాలనాన్ని టీమిండియా ఆటగాళ్లు తిరష్కరించిన సంగతి తెలిసిందే. ఈ ఖండాంతర టోర్నీలో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్ధులు మధ్య పోరు జరిగింది. అయితే ఈ మ్యాచ్ టాస్ దగ్గర నుంచి ఆట ముగిసే వరకు భారత జట్టు పాకిస్తాన్ ఆటగాళ్లతో అంటిముట్టనట్టు ఉన్నారు.
తొలుత టాస్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘాకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు నిరాకరించాడు. అనంతరం మ్యాచ్ ముగిశాక కూడా కరచాలనం చేసేందుకు భారత జట్టు ఇష్టపడలేదు. దీంతో భారత జట్టు తీసుకున్న ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది.
కానీ భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ మాత్రం టీమిండియా మెనెజ్‌మెంట్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. పాకిస్తాన్‌తో ఆడాలని నిర్ణయించుకున్నప్పుడు, షేక్ హ్యాండ్ ఇస్తే తప్పు ఏముందని తివారీ అన్నాడు. అయితే పాకిస్తాన్ మ్యాచ్‌తో భారత్ బహిష్కరించాలని తివారీ ముందే నుంచే తన వాదన వినిపిస్తూ వస్తున్నాడు.
"నేను భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌తో ఆసియాకప్ మొత్తాన్ని బాయ్‌కట్ చేస్తున్నాను. ఎందుకంటే క్రికెట్ అనేది కేవలం ఒక క్రీడ మాత్రమే. క్రీడలకు ఇచ్చిన విలువ జీవితాలకు ఇవ్వడం లేదు. ఇది నాకు నచ్చడం లేదు. మనం మానవ జీవితాలను క్రీడలతో పోల్చడం సరి కాదు" అని పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు తివారీ స్టెట్‌మెంట్ ఇచ్చాడు.
ఇప్పుడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తివారీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. "పాక్ ఆటగాళ్లతో హ్యాండ్ షేక్‌ను తిరష్కరించడం సరైన నిర్ణయం కాదు. మీరు పాకిస్తాన్‌తో ఆడాలని నిర్ణయించుకున్నప్పుడు.. హ్యాండ్ షేక్ చేస్తే తప్పు ఏముంది. పాక్‌తో మ్యాచ్‌ను బహిష్కరించి మీరు ఏది చెప్పినా ప్రజులు నమ్మేవారు.
ఈ టోర్నీ ఆరంభానికి ముందు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సూర్యకుమార్ యాదవ్.. పాకిస్తాన్ కెప్టెన్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఆ వీడియోను నేను చూశాను. మరి అప్పుడు ఎలా కరచాలనం చేశారు. ఆ సమయంలో మీకు తప్పు అన్పించలేదా?
అంటే ఇప్పుడు విమర్శకుల నుంచి తప్పించుకోవడం కోసం నో హ్యాండ్ షేక్ నిర్ణయం తీసుకున్నారా? ముందే వారి కెప్టెన్, చైర్మెన్‌కు హ్యాండ్ షేక్ ఇచ్చి ఇప్పుడు మ్యాచ్‌లో తిరష్కరించి ఏమి సాధించారో నాకు ఆర్ధం కావడం లేదు. విమర్శకుల నుంచి తామును తాము రక్షించుకోవడానికే ఈ విజయాన్ని పహల్గామ్ బాధితులకు, భారత సాయుధ దళాలకు అంకితం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు" అని ఇన్‌సైడ్ స్పోర్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తివారీ పేర్కొన్నాడు.
చదవండి: Asia Cup Handshake Controversy: హ్యాండ్ షేక్ వివాదం.. పాకిస్తాన్‌కు ఐసీసీ షాక్?