
ఆసియాకప్-2025లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ తర్వాత హ్యాండ్ షేక్ వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాళ్లతో భారత ప్లేయర్లు కరచాలనం చేసేందుకు నిరాకరించారు. పెహల్గమ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ వంటి పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడడటంపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలోనే బీసీసీఐ సూచన మేరకు నో హ్యాండ్‌షేక్ విధానాన్ని భారత్ అనుసరించినట్లు తెలుస్తోంది. ఇందుకు నిరసనగా పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా పోస్ట్ మ్యాచ్ ప్రేజెంటేషన్‌కు హాజరకాలేదు. అదేవిధంగా భారత ఆటగాళ్లు పరస్పర కరచాలనం తిరస్కరించడంపై పాకిస్తాన్ అగ్గిమీద గుగ్గిలమవుతోంది.
ఈ ఘటనపై పీసీబీ ఐసీసీకి,ఏసీసీకి ఫిర్యాదు చేసింది. భారత్, పాక్ మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించిన ఆండీ పైక్రాఫ్ట్‌ను ఆసియాకప్ 2025 నుంచి వెంటనే తొలగించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు డిమాండ్ చేసింది. 'నో హ్యాండ్‌షేక్' గురుంచి పైక్రాఫ్ట్‌కు ముందే తెలుసు అని పీసీబీ ఆరోపిస్తుంది.
పైక్రాఫ్ట్ టాస్ సందర్బంగా ఈ విషయాన్ని తమ కెప్టెన్‌కు తెలియజేశాడని, కానీ మ్యాచ్ అనంతరం కూడా ఇదే విధానం కొనసాగుతుందని ఆయన చెప్పలేదని పీసీబీ ఓ ప్రకటనలో పేర్కొంది. స్పిరిట్ ఆఫ్ క్రికెట్ ఉల్లంఘన జరిగింది. మ్యాచ్ రిఫరీపై చర్య తీసుకోవాలి పాక్ క్రికెట్ ఐసీసీని అభ్యర్దించింది. ఒకవేళ ఐసీసీ చర్యలు తీసుకోపోతే యూఏఈతో జరిగే తమ తదుపరి మ్యాచ్‌ను బహష్కిరిస్తామని పీసీబీ బెదరింపులకు దిగింది.
పీసీబీకి షాక్..?
అయితే ఆసియా కప్ మ్యాచ్ రిఫరీల ప్యానెల్ నుండి ఆండీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలని పీసీబీ చేసిన అభ్యర్థనను ఐసీసీ తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. క్రిక్‌బజ్ ప్రకారం.. పీసీబీ వాదనతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఏకీభవించకపోయినట్లు సమాచారం.
ఈ ఘటనతో పైక్రాఫ్ట్‌కు సంబంధం లేదని పీసీబీకి ఐసీసీ తెలియజేసినట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా ఆటగాళ్లు తప్పనిసరిగా హ్యాండ్ షేక్ ఇవ్వాలని ఎంసీసీ మాన్యువల్‌లో లేదు అని ఐసీసీ ప్రతినిథులు పీసీబీ చీఫ్‌కు మెయిల్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై ఐసీసీ అధికారికంగా స్పందించాల్సిన అవసరముంది.
చదవండి: PKL 12: ఉత్కంఠపోరులో తెలుగు టైటాన్స్ ఓటమి..