Legends League Cricket: మళ్లీ బ్యాట్‌ పట్టనున్న సెహ్వగ్‌.. గుజరాత్‌ కెప్టెన్‌గా ఎంపిక

Sehwag, Gambhir To Lead Gujarat Giants, India Capitals In Legends League Cricket - Sakshi

సెప్టెంబర్‌ 16 నుంచి ప్రారంభంకానున్న లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌ (ఎల్‌ఎల్‌సీ) తదుపరి ఎడిషన్‌ కోసం డాషింగ్‌ ఆటగాడు, టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ మళ్లీ బ్యాట్‌ పట్టబోతున్నాడు. చాలాకాలంగా క్రికెట్‌కు దూరంగా ఉన్న వీరూను ఎల్‌ఎల్‌సీలోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్‌ జెయింట్స్‌ (గౌతం అదానీ నేతృత్వంలోని జట్టు) కెప్టెన్‌గా ఎంచుకుంది. ఈ సందర్భంగా సెహ్వాగ్‌ మాట్లాడుతూ.. మళ్లీ బ్యాట్‌ పట్టి గ్రౌండ్‌లోకి దిగుతానన్న అనుభూతి చాలా సంతోషాన్ని కలిగిస్తుందని అన్నాడు. ఈ టోర్నీలో పాల్గొనేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నానని, జట్టు ఎంపిక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాని తెలిపాడు.  

మరోవైపు ఈ టోర్నీలో పాల్గొనబోయే మరో కొత్త జట్టు ఇండియా క్యాపిటల్స్ (జీఎంఆర్ జట్టు)‌.. వీరూ సహచరుడు, టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పింది. 2018లో క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన గంభీర్‌ ప్రస్తుతం ఐపీఎల్‌లో లక్నో ఫ్రాంచైజీ మెంటార్‌గా, ఢిల్లీ ఎంపీగా వ్యవహరిస్తున్నాడు.  ఇండియా క్యాపిటల్స్ కెప్టెన్‌గా ఎంపికైన సందర్భంగా గంభీర్‌ మాట్లాడుతూ.. ఎల్‌ఎల్‌సీలో ఆడేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నానని, ఎల్‌ఎల్‌సీ లీగ్‌ మంచి విజయం సాధించాలని ఆకాంక్షించాడు. 

కాగా, సెప్టెంబర్‌ 16న కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా ప్రారంభంకానున్న ఎల్‌ఎల్‌సీ రెండో ఎడిషన్‌లో గుజరాత్‌ జెయింట్స్‌, ఇండియా క్యాపిటల్స్ జట్లతో పాటు ఇండియా మహారాజాస్, వరల్డ్ జెయింట్స్ జట్లు పాల్గొంటున్నాయి. వీటిలో ఇండియా మహారాజాస్‌కు బీసీసీఐ బాస్‌ గంగూలీ సారధ్యం వహించనుండగా.. వరల్డ్ జెయింట్స్ జట్టుకు ఇయాన్‌ మోర్గాన్‌ నేతృత్వం వహించనున్నాడు. తొలి మ్యాచ్‌లో ఇండియా మహారాజాస్, వరల్డ్ జెయింట్స్ జట్లు తలపడనున్నాయి. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ ఉత్సవాల్లో భాగంగా బీసీసీఐ ఈ మ్యాచ్‌ను నిర్వహించనుంది. 
చదవండి: టీమిండియాను మరోసారి ముందుండి నడిపించనున్న సచిన్‌ టెండూల్కర్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top