'రసెల్‌ కంటే శుభమన్‌ కీలకం కానున్నాడు'

Scott Styris Says Shubhman Gill Was Best Batsman In KKR For IPL 2020 - Sakshi

దుబాయ్‌ : ఐపీఎల్‌ 13వ సీజన్‌లో నేడు మరో బిగ్‌ఫైట్‌ జరగనుంది. ఈ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ డిపెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌తో తమ మొదటి మ్యాచ్‌ ఆడనుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి కళ్లు విండీస్‌ ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రసెల్‌పై పడ్డాయి. ఎందుకంటే 2019 సీజన్‌లో రసెల్‌ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో చేసిన రచ్చ మాములుగా లేదు. ఆ సీజన్‌లో కోల్‌కతా తరపున 14 మ్యాచ్‌లాడిన రసెల్‌ 510 పరుగులు, 11 వికెట్లు సాధించి ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచాడు. అంతేగాక రసెల్‌ టోర్నీ మొత్తంలో 52 సిక్సులు బాది ఒక సీజన్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన ఆటగాడిగా గేల్‌ తర్వాత రికార్డు నెలకొల్పాడు. అయితే ఈ సీజన్‌లో ఆండ్రీ రసెల్‌ కంటే శుభమన్‌ గిల్‌ జట్టుకు కీలకంగా మారనున్నాడని న్యూజిలాండ్‌ మాజీ ఆటగాడు స్కాట్‌ స్టైరిస్‌ అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా రాబిన్‌ ఊతప్ప, గౌతమ్‌ గంభీర్‌ కోల్‌కతాకు దూరమైన తర్వాత శుభమన్‌ గిల్‌ కీలకపాత్ర పోషించే అవకాశం ఉందని తెలిపాడు. స్టార్‌స్పోర్ట్స్‌తో జరిగిన ఇంటర్య్వూలో పలు ఆసక్తికర విషయాలు పేర్కొన్నాడు.

'గత 18 నెలలుగా శుభమన్‌ గిల్‌ను దగ్గర్నుంచి చూస్తున్నా.. గిల్‌లో మంచి నైపుణ్యం ఉంది.. దానిని సక్రమంగా వాడితే విధ్వంసకర ఇన్నింగ్స్‌లు చూసే అవకాశం ఉంటుంది. గతంలో జట్టుకు ప్రాతినిధ్యం వహించిన రాబిన్‌ ఊతప్ప, గంబీర్‌లు లేకపోవడంతో గిల్‌ జట్టులో కీలకంగా మారడంతో పాటు ప్రధాన బ్యాట్స్‌మన్‌గా మారే అవకాశం ఉంది. రసెల్‌ విధ్వంసం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. కానీ అతను విదేశీ ఆటగాడిగా జట్టులో ఉంటాడు కాబట్టి.. దేశీయ ఆటగాళ్లలో శుభమన్‌కు ఇది మంచి అవకాశమని నా అభిప్రాయం. (చదవండి : ఆర్చర్‌ రెచ్చిపోతాడని అప్పుడు ఊహించలేదు) 

అంతేగాక స్వదేశీ ఆటగాళ్లలో పృథ్వీ షా, దేవదూత్‌ పడిక్కల్‌ కంటే గిల్‌పై ఎక్కువ ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఒకరకంగా వారిద్దరు వేరే టీమ్‌లలో కొనసాగుతున్నా.. సీనియర్‌ ఆటగాళ్ల మధ్యన ఉండడంతో ఒత్తిడి తక్కువగా ఉండి ఆటపై దృష్టి సారిస్తారు. కానీ గిల్‌కు ఆ అవకాశం లేదు.. కోల్‌కతాలో అంతా హిట్టర్లే కనిపిస్తున్నారు. ఎవరికి వారే హిట్టింగ్‌ చేసే నైపుణ్యం ఉండడంతో గిల్‌ తన ప్రతిభను బయటపెట్టేందుకు ఇదే చక్కని అవకాశం. నా దృష్టిలో కేకేఆర్‌ జట్టు ఐపీఎల్‌ 2020లో టాప్‌4 లో ఒకటిగా నిలుస్తుందంటూ' తెలిపాడు. దినేశ్‌ కార్తిక్‌ నేతృత్వంలో మంచి హిట్టర్లతో బలంగా కనిపిస్తున్న కేకేఆర్‌ ముంబైతో మ్యాచ్‌లో ఏ విధమైన ప్రదర్శన ఇస్తుందనేది కొద్దిసేపట్లో తేలనుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top