అందరి ఆకాంక్షలు నెరవేరుస్తాం | Sakshi
Sakshi News home page

అందరి ఆకాంక్షలు నెరవేరుస్తాం

Published Thu, Jul 22 2021 5:37 AM

Sania mirza Talks about tokyo olympics - Sakshi

నా కెరీర్‌లో నాలుగో ఒలింపిక్స్‌ ఆడుతుండటం ఎంతో ఉత్సాహాన్నిస్తుంది. మెగా ఈవెంట్‌ కోసం చక్కగా ప్రాక్టీస్‌ చేశాను. మధ్యలో కరోనా మహమ్మారి ఇబ్బంది పెట్టింది. అయితే గత కొంతకాలంగా పోటీల్లో పాల్గొంటుండటం, అంకిత రైనాతో కలిసి చేసిన ప్రాక్టీస్‌ చూస్తుంటే అంతా బాగానే ఉందనిపిస్తోంది. కోవి డ్‌తో కఠినమైన సవాళ్లు ఎదురవడంతో ఈ ఒలింపిక్స్‌ నిర్వహణకు కచ్చితమైన ప్రొటోకాల్‌ చేపట్టారు. అథ్లెట్లు సురక్షితంగా పాల్గొనేలా ఎన్నో ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు.

భారత ప్రభుత్వం కూడా ఈ విశ్వక్రీడలకు అర్హత సంపాదించిన అథ్లెట్లకు టీకాలు, బయో బబుల్‌ శిక్షణ ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేసింది. అంతర్జాతీయ ప్రయాణ ఆంక్షల నేపథ్యంలో ప్రత్యేక విమానంలో నేరుగా టోక్యో చేర్చింది. ఇది అథ్లెట్ల ప్రయాణ బడలికను తగ్గించింది. నిజానికి ప్రభుత్వం చేయాల్సిన దానికంటే ఎక్కువే చేసింది. ఒలింపిక్స్‌లో రాణించేందుకు ఎన్నో సమకూర్చింది. బృందాలకే కాదు వ్యక్తిగతంగా కూడా అథ్లెట్ల ప్రయాణాలు సజావుగా సాగేందుకు కేంద్ర ప్రభుత్వం  చర్యలు చేపట్టింది.

నా వరకైతే ముందుగా వింబుల్డన్‌లో ఆడేందుకుగానీ, అక్కడి నుంచి ఇక్కడికి చేరేందుకుగానీ క్రీడాశాఖ, విదేశీ వ్యవహారాల శాఖల చొరవ అంతా ఇంతా కాదు. ఇలాంటి ఏర్పాట్ల వల్లే నేను రెండేళ్ల కుమారుడిని వెంటేసుకొని యూరోప్‌ టూర్‌లో ప్రాక్టీస్, టోర్నీలు స్వేచ్ఛగా ఆడగలిగాను. ఇప్పు డు మరోసారి విశ్వక్రీడల్లో ఆడటం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ కూడా కోవిడ్‌ రిస్క్‌ను దాదాపు తగ్గించేందుకు కృషిచేస్తున్నారు. దీంతో టోక్యో చేరిన అథ్లెట్లందరూ ఏ బెంగా లేకుండా అత్యుత్తమ ప్రదర్శనపై దృష్టి పెట్టొచ్చు. మేమంతా కలిసి జట్టుగా 130 కోట్ల భారతీయుల ఆకాంక్షలు నేరవేర్చేందుకు మా వంతు ప్రయత్నం చేస్తాం.  

Advertisement

తప్పక చదవండి

Advertisement