
ఆసియాకప్-2025 సన్నాహాకాల్లో యూఏఈ వేదికగా జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్‌లో పాకిస్తాన్ అదరగొడుతోంది. ఈ ట్రైసిరిస్‌లో పాక్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. తొలి మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌ను చిత్తు చేసిన పాకిస్తాన్.. ఇప్పుడు రెండో మ్యాచ్‌లో యూఈఏపై అదే ఫలితాన్ని పునరావృతం చేసింది.
శనివారం షార్జాలో జరిగిన మ్యాచ్‌లో యూఏఈపై 31 పరుగుల తేడాతో మెన్ ఇన్ గ్రీన్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది. పాక్ బ్యాటర్లలో సైమ్ అయూబ్(38 బంతుల్లో 7 ఫోర్లు,4 సిక్స్‌లతో 69), హసన్ నవాజ్(26 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లతో 56) మెరుపు హాఫ్ సెంచరీలతో మెరిశారు. వారితో మహ్మద్ నవాజ్(25), అష్రాఫ్(16) రాణించారు. యూఏఈ బౌలర్లలో సిద్దుఖీ, సగీర్ ఖాన్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. హైదర్ అలీ రెండు వికెట్లు సాధించాడు.
అనంతరం భారీ లక్ష్య చేధనకు దిగిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 176 పరుగులకే పరిమితమైంది. యూఏఈ బ్యాటర్ అసిఫ్ ఖాన్(35 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 77) మెరుపు ఇన్నింగ్స్ ఆడినప్పటికి తన జట్టును గెలిపించలేకపోయాడు.
అతడితో మహ్మద్ వసీం(33) పర్వాలేదన్పించాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. పాక్ బౌలర్లలో హసన్ అలీ మూడు వికెట్లు పడగొట్టగా.. నవాజ్ రెండు, మిర్జా, అయూబ్ ఒక్క వికెట్ సాధించారు.
చదవండి: IPL 2026: అక్షర్ పటేల్‌పై వేటు.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా టీమిండియా స్టార్!?