'వైభవ్‌ కాదు.. ముందు అతడిని టీమిండియాకు ఎంపిక చేయండి' | Sai Sudharsans Name Thrown In The Mix For Indian Cricket Teams T20 Squad | Sakshi
Sakshi News home page

'వైభవ్‌ కాదు.. ముందు అతడిని టీమిండియాకు ఎంపిక చేయండి'

May 13 2026 5:59 PM | Updated on May 13 2026 6:09 PM

Sai Sudharsans Name Thrown In The Mix For Indian Cricket Teams T20 Squad

ఐపీఎల్‌-2026 సీజ‌న్‌లో గుజ‌రాత్ టైటాన్స్ యువ ఆట‌గాడు సాయి సుద‌ర్శ‌న్ దుమ్ములేపుతున్నాడు. మంగ‌ళ‌వారం అహ్మ‌దాబాద్ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో సుద‌ర్శ‌న్ అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. ఆరంభంలోనే శుభ్‌మ‌న్ గిల్‌, జోస్ బ‌ట్ల‌ర్ వంటి కీల‌క వికెట్ల‌ను కోల్పోయిన గుజ‌రాత్‌ను సుద‌ర్శ‌న్ త‌న హాఫ్ సెంచ‌రీతో ఆదుకున్నాడు. 

కష్టతరమైన పిచ్‌పై సుదర్శన్ సంయమనంతో ఆడి గుజరాత్ జట్టు 168 పరుగుల స్కోరు సాధించేలా చేశాడు. మొత్తంగా 44 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌ల‌తో 61 ప‌రుగులు సాధించాడు. మొత్తంగా ఈ ఏడాది సీజ‌న్‌లో 11 మ్యాచ్‌లు ఆడిన సుద‌ర్శ‌న్‌..  41.75 సగటుతో 501 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 

సుద‌ర్శ‌న్ 500 ప‌రుగులు దాట‌డం ఇది వ‌రుస‌గా మూడో సీజ‌న్ కావ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో సుద‌ర్శ‌న్‌పై టీమిండియా మాజీ ఓపెన‌ర్ వసీం జాఫర్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. సుద‌ర్శ‌న్ ఆట‌తీరును కొనియాడుతూ, అత‌డిని భార‌త టీ20 జ‌ట్టులోకి తీసుకోవాల‌ని సుద‌ర్శ‌న్ సూచించాడు.

ఐపీఎల్‌-2026 సీజ‌న్ ఆరంభంలో సుద‌ర్శ‌న్ ఆరెంజ్ క్యాప్ రేసులో దారుదాపుల్లో కూడా క‌న్పించ‌లేదు. కానీ ఇప్పుడు త‌న అద్భుతమైన ఆట తీరుతో ఒక్క‌సారిగా ఆరెంజ్ క్యాప్ రేసులోకి దూసుకొచ్చాడు. గుజ‌రాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ అత‌డికి బాగా క‌లిసి వ‌స్తోందని, అహ్మ‌దాబాద్ పిచ్ కూడా అతడికి సహకరిస్తుందని నేను ఇప్ప‌టికే చాలా సార్లు చెప్పాను.

అతను  సాంప్రదాయబద్ధమైన (Orthodox) క్రికెట్ షాట్లు ఆడ‌తాడు. అలా అని ఎక్క‌డా స్లోగా ఆడ‌డు. మైదానానికి రెండు వైపులా పరుగులు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. గుజ‌రాత్ ఫ్రాంచైజీ అతడిపై చాలా ఎక్కువగా ఆధారపడుతుంది. అయిన‌ప్ప‌టికి ప్ర‌తీ సీజ‌న్‌లోనూ అత‌డు రాణిస్తున్నాడు. 

మ‌నం సాధారణంగా భారత టీ20 జట్టు గురించి చర్చించేటప్పుడు సుద‌ర్శ‌న్ పేరును క‌నీసం ప‌రిగ‌ణ‌లోకి తీసుకోము. కానీ అత‌డు త‌న ప్ర‌ద‌ర్శ‌న‌లతో మ‌న ఆలోచ‌న త‌ప్పు అని ప్ర‌తీసారి నిరూపిస్తున్నాడు. ఇలాంటి నిలకడ ఉన్న ఆటగాడు జట్టులో ఉండాలి. కేవలం సిక్సర్లు కొట్టే ఆట‌గాళ్లు మాత్ర‌మే కాదు, క‌ష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే ఆట‌గాళ్లు కూడా జ‌ట్టులో ఉండాలి.

కాబ‌ట్టి టీమిండియా సెలక్ట‌ర్లు అత‌డిని క‌చ్చితంగా టీ20 జ‌ట్టులోకి తీసుకోవాల‌ని జాఫ‌ర్ త‌న యూట్యూబ్ ఛాన‌ల్‌లో పేర్కొన్నాడు. కాగా ఇదే సీజ‌న్‌లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తున్న వైభ‌వ్ సూర్య‌వంశీ పేరును జాఫ‌ర్ ప‌రిగ‌ణ‌లోకి తీసుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

Advertisement
 
Advertisement
Advertisement