Ban On Transgenders: మొన్న స్విమ్మింగ్‌.. ఇవాళ రగ్బీ; ట్రాన్స్‌జెండర్లకు వరుస అవమానాలు

Rugby League Bans Transgender Players From Womens Rugby Internationals - Sakshi

ప్రస్తుతం ప్రపంచంలో ట్రాన్స్‌జెండర్లకు దాదాపు అన్ని దేశాలు తమ పౌరులతో సమానంగా హక్కులు కల్పిస్తున్నాయి. అన్ని రంగాల్లో ట్రాన్స్‌జెండర్లు ముందుకు వెళ్తుంటే క్రీడల్లో మాత్రం వెనక్కి వెళ్తున్నట్లుగా అనిపిస్తుంది. ట్రాన్స్‌జెండర్లను ఆడించడం వల్ల ఆట సమతుల్యం దెబ్బతింటుందని అంతర్జాతీయ స్విమ్మింగ్‌ ఫెడరేషన్‌ ఇటీవలే పేర్కొంది. లింగమార్పిడి చేసుకున్న స్విమ్మర్లు పురుషుల యుక్త వయస్సు దాటితే మహిళల ఎలైట్ రేసుల్లో పాల్గొనరాదని.. అందుకే  స్విమ్మింగ్‌లో ట్రాన్స్‌జెండర్లు పాల్గొనకుండా నిషేధిస్తునట్లు నిర్ణయం తీసుకుంది.

తాజాగా అంతర్జాతీయ రగ్బీ లీగ్‌(ఐఆర్‌ఎల్‌) కూడా అదే బాటలో నడిచింది. ఇక నుంచి జరగబోయే అంతర్జాతీయ మహిళల రగ్బీ మ్యాచ్‌ల్లో ట్రాన్స్‌జెండర్ ప్లేయర్లను ఆడించకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది.  ట్రాన్స్‌జెండర్లను రగ్బీ ఆడించేందుకు సరికొత్త పాలసీలు తీసుకు రావాల్సి ఉంది. ప్రపంచ క్రీడలో సంబంధిత పరిణామాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది. రగ్బీ లీగ్‌లో ట్రాన్స్‌జెండర్లను ఆడించే విషయంలో ఇంకా పూర్తిస్తాయిలో పరిశోధన జరగాల్సి ఉందని  ఐఆర్‌ఎల్‌ అభిప్రాయపడింది. 

ఐఆర్ఎల్ తాజా నిర్ణయంతో అక్టోబర్ లో ఇంగ్లండ్ వేదికగా జరుగనున్న రగ్బీ లీగ్ మహిళల ప్రపంచకప్‌లో ట్రాన్స్‌జెండర్ కీడ్రాకారులు పాల్గొనే అవకాశం లేనట్లే.  ఈ ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా, బ్రెజిల్, ఇంగ్లండ్, ఫ్రాన్స్, న్యూజిలాండ్,  పపువా న్యూగినియా లాంటి జట్లు పోటీ పడుతున్నాయి. కాగా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐఓసీ) ఈ ఏడాది ప్రారంభంలో ట్రాన్స్‌జెండర్లకు ఆటల్లో పాల్గొనే హక్కులకు సంబంధించిన విధానాలను రూపొందించింది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని క్రీడా సమాఖ్యలన్నీ ట్రాన్స్‌జెండర్లు క్రీడల్లో పాల్గొనేందుకు కొత్త నిబంధనలు రాసుకునే పనిలో ఉన్నాయి.

ఇక ట్రాన్స్‌జెండర్లను రగ్బీ లీగ్ నుంచి నిషేధించడంపై క్రీడాలోకం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది. కొందరేమో.. 'వారు ఆడకపోతే మంచిదని' పేర్కొనగా.. 'ట్రాన్స్‌జెండర్లకు ఇది అవమానమే' అని మరికొందరు తెలిపారు. ఈ విషయంలో ట్రాన్స్‌జెండర్లు స్పందిస్తూ.. ఇది క్రీడల ప్రాథమిక సూత్రానికి విరుద్ధమని .. సమానత్వం కోసం పాటుపడే క్రీడల్లో ఇలా వివక్ష చూపడం సరైనది కాదని అభిప్రాయపడ్డారు.

చదవండి: Cristiano Ronaldo: కోట్ల విలువైన కారుకు యాక్సిడెంట్‌.. రొనాల్డో క్షేమంగానే

వింబుల్డన్‌ ఆడేందుకు రష్యా పౌరసత్వాన్ని వదులుకునేందుకు సిద్ధమైన టెన్నిస్‌ క్రీడాకారిణి 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top