Rovman Powell: క్రికెటర్‌ జీవితాన్ని మార్చిన పీఈటీ టీచర్‌

Rovman Powell recalls life changing career advice from his PE teacher - Sakshi

విండీస్‌ క్రికెటర్‌ రోవ్‌మెన్‌ పావెల్‌ హార్డ్‌హిట్టర్‌గా మాత్రమే మనకు పరిచయం. అయితే పావెల్‌ క్రికెటర్‌గా మారడానికి ఎన్నో కష్టాలు అనుభవించాడు. అతని జీవిత చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో అథ్లెట్‌గా మెరవాల్సినోడు ఇవాళ క్రికెటర్‌గా రాణించడం వెనుక తన స్కూల్‌ పీఈటీ టీచర్‌ కార్ల్టన్‌ సోలన్‌ పాత్ర ఎంతో ఉందట. ఈ విషయాన్ని రోవ్‌మెన్‌ పావెల్‌ స్వయంగా వివరించాడు. 

జమైకాలోని ఓల్డ్ హర్బర్‌లో జన్మించిన రోవ్‌మెన్ పావెల్‌కి తండ్రి లేడు. తల్లి, సోదరితో పెరిగిన పావెల్, చిన్నతరంలో కడుపునిండా తినడానికి కూడా ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చిందని, అతను చాలా కింది నుంచి పైకి వచ్చాడు... పేదరికాన్ని జయించడానికి ఆటను ఎంచుకున్నాడు. స్కూల్‌ చదువుతున్నప్పుడే తన కుటుంబాన్ని పేదరికం నుంచి బయటపడేస్తానని వాళ్ల అమ్మకి ప్రామిస్ చేశాడు. ఆ ప్రామిస్‌ని నిలబెట్టుకోవడానికే  క్రికెటర్‌గా మారాడు.

ఇదే విషయమై పావెల్ స్పందిస్తూ.. ''నా పీఈటీ టీచర్‌ కార్ల్టన్‌  నేను క్రికెట్ ఆడటం గమనించేవాడు. అయితే నేను  ఓసారి ట్రాక్ అండ్ ఫీల్డ్ ట్రైనింగ్ కు వెళ్లా. అక్కడ ఆయన కూడా ఉన్నాడు.. నువ్వు ఇక్కడికెందుకు వచ్చావ్..? బహుశా నువ్వు ఇక్కడికి రావడం ఇదే చివరిసారి అనుకుంటా. నువ్వు క్రికెట్ చాలా బాగా ఆడతావు.  ఈ ట్రాక్ అండ్ ఫీల్డ్ ను వదిలేయ్. ఇది నీకు సెట్ అవదు. నా మాట వినకుండా నువ్వు మళ్లీ ఇక్కడ గనక కనబడితే  కొట్టడం గ్యారంటీ. నువ్వు రెండింటి (క్రికెట్, ట్రాక్ అండ్ ఫీల్డ్) మీద దృష్టి సారిస్తానంటే కుదరదు.  అలా చేస్తే దేనిమీద వంద శాతం దృష్టి పెట్టలేవు'' అంటూ వివరించాడు. ఆయన సూచనతోనే పావెల్ క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకున్నానని తెలిపాడు. 

ఇక 2016లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన రోవ్‌మెన్‌ పావెల్‌ విండీస్‌ తరపున 45 వన్డేలు, 55 టి20 మ్యాచ్‌లు ఆడాడు. కాగా పావెల్‌ ఖాతాలో వన్డేల్లో ఒక సెంచరీ, టి20ల్లో ఒక సెంచరీ ఉండడం విశేషం.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top