Cristiano Ronaldo: నేను యూనిక్‌.. అక్కడ అన్ని రికార్డులు బద్దలు కొట్టా! నాకెన్నో ఆఫర్లు వచ్చాయి.. కానీ

Ronaldo Gets Rapturous Welcome In Saudi In Europe My Work Done - Sakshi

Cristiano Ronaldo- Al-Nassr Club: ‘‘యూరోప్‌లో నేను చేయాల్సిందంతా చేశాను... అక్కడ నాకెన్నో ఆఫర్లు వచ్చాయి.  బ్రెజిల్‌, ఆస్ట్రేలియా, అమెరికా సహా పోర్చుగల్‌లోనూ ఎన్నెన్నో అవకాశాలు తలుపుతట్టాయి. చాలా క్లబ్స్‌ నాతో ఒప్పందం కుదుర్చుకోవాలని భావించాయి. కానీ నేను ఈ క్లబ్‌కు మాట ఇచ్చాను’’ అంటూ పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో అన్నాడు.

తన ఇంకా కెరీర్‌ ముగిసిపోలేదని, తన గురించి ఎవరు ఎలా మాట్లాడినా పట్టించుకోనంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. తనను తాను విలక్షణ ఆటగాడిగా అభివర్ణించుకున్న రొనాల్డో.. యూరోప్‌లో ఉన్న రికార్డులన్నీ బద్దలు కొట్టానన్నాడు. ఇప్పుడు ఇక్కడ కొత్తగా రికార్డుల వేట మొదలుపెట్టానని వ్యాఖ్యానించాడు.

భారీ డీల్‌
కాగా ఫిఫా ప్రపంచకప్‌-2022కు ముందు యునైటెడ్‌ మాంచెస్టర్‌తో బంధం తెంచుకున్న రొనాల్డో.. సౌదీ అరేబియాకు చెందిన అల్ నజర్ ఫుట్‌బాల్‌ క్లబ్‌తో భారీ ఒప్పందం కుదుర్చుకున్నాడు. 2023 సీజన్ నుంచి 2025 జూన్ వరకూ ఈ క్లబ్‌ తరఫున ఆడేందుకు జరిగిన ఈ డీల్ విలువ 200 మిలియన్ యూరోలు.

ఈ క్రమంలో సౌదీకి చేరుకున్న 37 ఏళ్ల  రొనాల్డోకు ఘన స్వాగతం లభించింది. అల్‌ నజర్‌కు చెందిన మిర్సూల్‌ పార్క్‌ స్టేడియంలో పసుపు, నీలం రంగుల మేళవింపుతో కూడిన జెర్సీలో అతడు రాగానే.. పెద్ద ఎత్తున పటాకాలు కాలుస్తూ వెల్‌కం చెప్పారు నిర్వాహకులు. 

అక్కడ అన్ని రికార్డులు బద్దలు కొట్టా
ఈ సందర్భంగా రొనాల్డో మాట్లాడుతూ.. ‘‘నేను యూనిక్‌ ప్లేయర్‌ని. యూరోప్‌లో ఉన్న అన్ని రికార్డులు బద్దలు కొట్టాను. ఇప్పుడు కొత్త సవాళ్లు ఎదుర్కొంటూ మరిన్ని ఘనతలు సాధించేందుకు ఇక్కడకు వచ్చాను. 

సౌదీ అభివృద్ధిలో భాగం
గెలిచేందుకే ఇక్కడకు వచ్చాను. ఆటను ఆస్వాదిస్తాను. ఈ దేశ సంస్కృతీ సంప్రదాయాలు, అభివృద్ధిలో నేను కూడా భాగమవుతున్నందుకు సంతోషంగా ఉంది’’ అని హర్షం వ్యక్తం చేశాడు. ఇక రొనాల్డో గర్ల్‌ఫ్రెండ్‌ జార్జినా రోడ్రిగెజ్‌ సైతం సౌదీ మహిళ మాదిరి నలుపు రంగు అభయ ధరించి తమ పిల్లలతో కలిసి రొనాల్డో ఆగమనాన్ని వీక్షించడం విశేషం.

ఇందుకు సంబంధించిన వీడియో మిలియన్ల కొద్ది వ్యూస్‌తో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కాగా ఫిఫా వరల్డ్‌కప్‌లో పోర్చుగల్‌ నిరాశజనక ప్రదర్శనతో ట్రోఫీ గెలవాలన్న రొనాల్డో కల కలగానే మిగిలిపోయింది. అంతేగాక పలు మ్యాచ్‌లకు కెప్టెన్‌ రొనాల్డోను పక్కనపెట్టడం సంచలనంగా మారింది. ఈ క్రమంలో సౌదీ అరేబియాలో అతడు కొత్త క్లబ్‌ తరఫున ఆడనుండటం గమనార్హం.

చదవండి: Rishabh Pant: ఎయిర్‌ అంబులెన్స్‌లో ముంబైకి పంత్‌.. అంబానీ ఆస్పత్రిలో చికిత్స.. ఖర్చు మొత్తం ఎవరిదంటే!
Deepak Hooda: అసభ్య పదజాలం వాడిన హుడా! ఇంత నీచంగా మాట్లాడతావా అంటూ..

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top