టీ20లలో రోహిత్‌ తర్వాత అరంగేట్రం.. ఇప్పటికే రిటైరైన 10 మంది భారత ఆటగాళ్లు వీరే! హెడ్‌కోచ్‌ సైతం..

Rohit Sharma T20: Indian Players Made Debut After Him Already Retired - Sakshi

రోహిత్‌ శర్మ పదిహేనేళ్ల ప్రయాణం.. ఎన్నెన్నో ఘనతలు

Rohit Sharma 15 Years Of T20 Journey: టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ టీ20 ఫార్మాట్‌లో అరంగేట్రం చేసి నేటికి(సెప్టెంబరు 19) సరిగ్గా పదిహేనేళ్లు. ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌-2007లో భాగంగా పొట్టి ఫార్మాట్‌లో భారత్‌ తరఫున ఎంట్రీ ఇచ్చాడు హిట్‌మ్యాన్‌. ఇప్పటి వరకు 136 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 3620 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు. 28 అర్ధ శతకాలు ఉన్నాయి.

ఐపీఎల్‌లోనూ మేటి!
ఇక టీ20 ఫార్మాట్‌లో రోహిత్‌ అత్యధిక స్కోరు 118. ఇదిలా ఉంటే.. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో రోహిత్‌ శర్మకు ఉన్న రికార్డు గురించి ప్రత్యకంగా చెప్పనక్కర్లేదు. ముంబై ఇండియన్స్‌ సారథిగా జట్టును ఏకంగా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన ఘనత హిట్‌మ్యాన్‌ సొంతం.

క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో 227 మ్యాచ్‌లలో భాగమైన రోహిత్‌ 5879 పరుగులు సాధించాడు. ఇందులో ఓ శతకం, 40 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ఇక ఐపీఎల్‌లో అతడి అత్యధిక స్కోరు 109. ఇలా పదిహేనేళ్ల క్రితం ఐసీసీ మెగా ఈవెంట్‌తో తన టీ20 ప్రయాణం మొదలుపెట్టిన రోహిత్‌ శర్మ.. పొట్టి ఫార్మాట్‌లో తన జైత్రయాత్రను కొనసాగిస్తున్నాడు.

రోహిత్‌ తర్వాత అరంగేట్రం.. కానీ!
ఇప్పటికే టీమిండియా సారథిగా పలు టీ20 సిరీస్‌లు గెలిచి ప్రపంచ రికార్డులు నెలక్పొలిన ఈ హిట్‌మ్యాన్‌.. ప్రపంచకప్‌-2022లో తొలిసారిగా టీమిండియా టీ20 కెప్టెన్‌ హోదాలో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.

ఇదిలా ఉంటే.. రోహిత్‌ తర్వాత టీమిండియా తరఫున టీ20లలో అరంగేట్రం చేసిన 10 మంది భారత ఆటగాళ్లు.. రోహిత్‌ కంటే ముందే రిటైర్‌ కావడం విశేషం. వారెవరో తెలుసుకుందాం!

యూసఫ్‌ పఠాన్‌
ఆల్‌రౌండర్‌ యూసఫ్‌ పఠాన్‌.. రోహిత్‌ శర్మ టీ20లలో ఎంట్రీ ఇచ్చిన కొన్నిరోజులకే భారత్‌ తరఫున అరంగేట్రం చేశాడు. ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌-2007 ఫైనల్లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో భాగంగా తొలిసారి తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు.

ఇక భారత్‌ తరఫున 22 టీ20 మ్యాచ్‌లు ఆడిన యూసఫ్‌.. ఫిబ్రవరి 2021లో రిటైర్మెంట్‌ ప్రకటించాడు.

మురళీ కార్తిక్‌
మురళీ కార్తిక్‌ 2007లో ఆస్ట్రేలియాతో సిరీస్‌తో పొట్టి ఫార్మాట్‌లో అంతర్జాతీయ కెరీర్‌ ఆరంభించాడు. ఇక ఐపీఎల్‌-2014లో భాగంగా తన చివరి టీ20 ఆడిన మురళీ కార్తిక్‌ ప్రస్తుతం క్రికెట్‌ విశ్లేషకుడిగా కొనసాగుతున్నాడు.

ప్రవీణ్‌ కుమార్‌
ఆస్ట్రేలియాతో సిరీస్‌లో భాగంగా 2008లో అంతర్జాతీయ టీ20లలో అరంగేట్రం చేశాడు ప్రవీణ్‌ కుమార్‌. భారత్‌ తరఫున మొత్తం 10 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. తరచూ గాయాల బారిన పడిన కారణంగా 2018లో ఆటకు గుడ్‌బై చెప్పాడు ప్రవీణ్‌ కుమార్‌.

ప్రజ్ఞాన్‌ ఓజా
టీమిండియా మాజీ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ ప్రజ్ఞాన్‌ ఓజా 2009 టీ20 వరల్డ్‌కప్‌ సందర్భంగా పొట్టి ఫార్మాట్‌లో అడుగుపెట్టాడు. 2010లో తన చివరి అంతర్జాతీయ టీ20 ఆడిన ఓజా.. 2020లో క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. భారత్‌ తరఫున అతడు మొత్తం ఆరు టీ20లు ఆడాడు.

ఆశిష్‌ నెహ్రా
భారత మాజీ లెఫ్టార్మ్‌ పేసర్‌ ఆశిష్‌ నెహ్రా శ్రీలంకతో మ్యాచ్‌ ద్వారా 2009లో తన అంతర్జాతీయ టీ20 కెరీర్‌ ఆరంభించాడు. మొత్తంగా టీమిండియా తరఫున 27 టీ20 మ్యాచ్‌లు ఆడిన నెహ్రా.. 2017లో తన చివరి టీ20 ఆడాడు.

ప్రస్తుతం అతడు ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ గుజరాత్‌ టైటాన్స్‌ కోచ్‌గా సేవలు అందిస్తున్నాడు. తొలి సీజన్‌లోనే క్యాష్‌ రిచ్‌లో గుజరాత్‌ను టైటిల్‌ విజేతగా నిలిపి.. ఈ ఘనత అందుకున్న తొలి భారత హెడ్‌కోచ్‌గా నిలిచాడు నెహ్రా.

సుదీప్‌ త్యాగి
2009లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ఆడిన సుదీప్‌ త్యాగి.. శ్రీలంకతో మ్యాచ్‌ ద్వారా అదే ఏడాది అంతర్జాతీయ టీ20లలో అడుగుపెట్టాడు. అయితే, దురదృష్టవశాత్తూ అదే అతడికి చివరి టీ20 అయింది. 2020లో అతడు ఆటకు గుడ్‌బై చెప్పాడు.

వినయ్‌ కుమార్‌
టీ20 వరల్డ్‌కప్‌-2010 సందర్భంగా శ్రీలంకతో మ్యాచ్‌తో అంతర్జాతీయ టీ20లలో ఎంట్రీ ఇచ్చాడు వినయ్‌ కుమార్‌. భారత్‌ తరఫున 2010- 12 మధ్యకాలంలో తొమ్మిది టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 2021లో అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలిగాడు. 

రాహుల్‌ శర్మ
టీమిండియా లెగ్‌ స్పిన్నర్‌ రాహుల్‌ శర్మ 2012లో అంతర్జాతీయ టీ20లలో అడుగుపెట్టాడు. కేవలం రెండే మ్యాచ్‌లు ఆడాడు. ఈ ఏడాది ఆరంభంలో ఆటకు వీడ్కోలు పలికాడు.

రాహుల్‌ ద్రవిడ్‌
టీమిండియా వాల్‌, ప్రస్తుత హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ సైతం రోహిత్‌ శర్మ తర్వాత.. నాలుగేళ్లకు అంతర్జాతీయ టీ20లలో అడుగుపెట్టడం విశేషం. 2011లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ సందర్భంగా అంతర్జాతీయ కెరీర్‌లో ద్రవిడ్‌ తన తొలి టీ20 ఆడాడు. అదే ద్రవిడ్‌కు ఆఖరిది కూడా! ఇక 2012లో అతడు రిటైర్‌ అయిన విషయం తెలిసిందే.

పార్థివ్‌ పటేల్‌
పార్థివ్‌ పటేల్‌ 2011 వెస్టిండీస్‌తో మ్యాచ్‌ సందర్భంగా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఎంట్రీ ఇచ్చాడు. కెరీర్‌లో రెండే రెండు టీ20లు ఆడాడు. 2020లో రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఇక పార్థివ్‌ పటేల్‌ యూఏఈ ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌లో భాగంగా ఇటీవలే ఎంఐ ఎమిరేట్స్‌ బ్యాటింగ్‌ కోచ్‌గా నియమితుడయ్యాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top