మిర్చీ భార్గవి.. పరుగుల రాణీ..!

RJ Bhargavi Completes Three Big Marathons - Sakshi

హాయ్‌.. హలో అంటూ సాక్షి టీవీలో బ్యాండ్‌ బాజా ప్రోగ్రాంను పరుగులెత్తించిన మిర్చీ భార్గవి నిజ జీవితంలో పరుగుల రాణీగా మారింది. హైదరాబాద్‌లో రేడియో జాకీగా బిజీగా ఉంటూనే వివిధ ప్రాంతాల్లో మారథాన్‌లలో పాల్గొంటోంది భార్గవి. ఫిట్‌నెస్‌ అంటే తనకు ప్రాణమని చెప్పుకునే భార్గవి.. మన జీవితం ఒకే సారి ఉంటుందని, ఆరోగ్యకరమైన అలవాట్లు, జీవన విధనాంతో మరింత సంతోషంగా ఉండవచ్చని చెబుతోంది. మెరుగైన ఫిట్‌ నెస్‌ కోసం పరుగెత్తడం మొదలెట్టిన భార్గవి కొన్నాళ్లలోనే ప్రొఫెషనల్‌ రన్నర్‌గా మారిపోయింది. 

భార్గవి ఖాతాలో మూడు
ప్రపంచంలోనే మూడు అతి పెద్ద మారథాన్లుగా పేరుపడ్డ బెర్లిన్‌ (జర్మనీ), న్యూయార్క్‌ (అమెరికా)లలో పాల్గొన్న భార్గవి.. ఈ నెలలో షికాగో (అమెరికా) మారథాన్‌లోనూ పాల్గొన్నారు. "ఒక్కసారి మారథాన్‌లో పాల్గొనడమనేది జీవితానికి సరిపడా అనుభవాలను, పాఠాలను నేర్పిస్తుంది.  నువ్వు మారథాన్‌ను పూర్తి చేయగలిగితే జీవితంలో ఏదైనా సాధిస్తావన్న ఆత్మవిశ్వాసం కలిగిస్తుందంటారు" భార్గవి.

వణికించే ఛాలెంజ్‌ షికాగో
ఇటీవల షికాగోలో జరిగింది 44వ ఎడిషన్‌ మారథాన్‌. ఇందులో 40 వేల మంది వేర్వేరు దేశాల రన్నర్లు పాల్గొన్నారు. షికాగోను విండ్‌ సిటీ అని కూడా అంటారు. వణికించే చల్లటి ఈదురుగాలుల మధ్య మారథాన్‌లో పాల్గొనడమంటే మాటలు కాదు. గ్రాంట్‌ పార్క్‌ వద్ద ఎండ్‌ పాయింట్‌ను చేరుకున్న విజేతలు తమ స్వప్నాన్ని పూర్తి చేసుకున్నందుకు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. 

ప్లానింగ్‌ వర్సెస్‌ సక్సెస్‌
"ఇంత బిజీగా ఉంటావు, పరుగులెలా తీస్తున్నావని నన్ను అందరూ అడుగుతారు, ఒక రోజును మనం ఏ రకంగా ప్లాన్‌ చేసుకుంటున్నామన్న దాంట్లోనే ఉంది. ఫిట్‌నెస్‌ కోసం ప్రతీ రోజు కొంత సమయం కేటాయించుకోగలిగితే.. మనలో తేడా మనకే తెలుస్తుంది" అంటారు భార్గవి. ఆల్‌ ది బెస్ట్‌ పరుగుల రాణీ.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top