
ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లోకి మరో భారత ఆటగాడు అరంగేట్రం చేయనున్నాడు. తమిళనాడు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రవిశ్రీనివాస్ సాయి కిషోర్ సర్రే కౌంటీ జట్టుతో రెండు మ్యాచ్‌ల స్వల్ప ఒప్పందం చేసుకున్నాడు. సాయి కిషోర్ ఈ నెల 22న యార్క్‌షైర్‌తో జరుగబోయే మ్యాచ్‌తో కౌంటీ అరంగేట్రం చేస్తాడు.
ఆ మ్యాచ్‌లో సాయి తన మాజీ సీఎస్‌కే సహచరడు రుతురాజ్ గైక్వాడ్‌ను ఢీకొంటాడు. రుతురాజ్ కూడా ఇదే సీజన్‌తో యార్క్‌షైర్ తరఫున కౌంటీ అరంగేట్రం చేశాడు.
28 ఏళ్ల సాయి సర్రే క్లబ్‌తో ఒప్పందం చేసుకోవడంపై ఆనందం వ్యక్తం చేశాడు. ఘన చరిత్ర కలిగిన సర్రేకు ఆడటం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపాడు. సాయి ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడతాడు. రంజీ ట్రోఫీలో తమిళనాడు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.
భారత్ తరఫున 3 టీ20లు ఆడిన సాయికి ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఈ ఫార్మాట్‌లో అతను 23.5 సగటున 192 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లో 2022 సీజన్ నుంచి గుజరాత్‌కు ఆడుతున్న సాయి.. ఈ లీగ్‌లో 25 మ్యాచ్‌లు ఆడి 20.3 సగటుతో 32 వికెట్లు తీశాడు.
ఈ సీజన్‌లో ఆరో క్రికెటర్
ప్రస్తుత కౌంటీ సీజన్‌లో ఆడేందుకు భారత ఆటగాళ్లు క్యూ కడుతున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటికే ఐదుగురు భారత ఆటగాళ్లు వేర్వేరు క్లబ్‌లకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇషాన్ కిషన్ నాటింగ్హమ్‌షైర్, తిలక్ వర్మ హ్యాంప్‌షైర్, ఖలీల్ అహ్మద్ ఎసెక్స్, రుతురాజ్ గైక్వాడ్ యార్క్‌షైర్, యుజ్వేంద్ర చహల్ నార్తంప్టన్‌షైర్‌కు ఆడుతున్నారు.
వీరిలో యువ బ్యాటర్లు తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ తమ అరంగేట్రం మ్యాచ్‌ల్లోనే ఇరగదీశారు. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో తిలక్ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ చేయగా.. ఇషాన్ రెండు మ్యాచ్‌ల్లో రెండు హాఫ్ సెంచరీలు చేశారు.