265 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన పంజాబ్ కింగ్స్
ఢిల్లీకి అనూహ్య పరాజయం
శ్రేయస్, ప్రభ్‌సిమ్రన్, ప్రియాన్ష్ మెరుపులు
కేఎల్ రాహుల్ సూపర్ సెంచరీ వృథా
ఆహా ఏమా మ్యాచ్... ఏమా కొట్టుడు! ఒకరిని మించి ఒకరు వంతులు వేసుకున్నట్లు... ప్రత్యర్థి బౌలర్లపై ఏదో పగ పట్టినట్లు... బంతిమీద ఆజన్మ శత్రుత్వం ఉన్నట్లు...
ఫోర్లు, సిక్స్‌లు ఒకటే మోత! మొదట కేఎల్ రాహుల్, నితీశ్ రాణా దంచి కొట్టడంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ చరిత్రలో తమ అత్యధిక స్కోరు నమోదు చేసుకుంటే... పంజాబ్ కింగ్స్ మరో 7 బంతులు మిగిలుండగానే దాన్నిఊదేసింది.
ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన భారత ప్లేయర్‌గా కేఎల్ రాహుల్ రికార్డు సృష్టిస్తే... మేమేం తక్కువా అన్నట్లు ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్, శ్రేయస్ అయ్యర్ విశ్వరూపం చూపారు. దీంతో ఐపీఎల్‌లో అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా పంజాబ్ తమ పేరిటే ఉన్న రికార్డును మరింత మెరుగు పరుచుకుంది. రెండు జట్లు కలిపి 49 ఫోర్లు, 33 సిక్స్‌లు బాదిన ఈ మ్యాచ్‌లో మొత్తం 529 పరుగులు నమోదు కాగా... శనివారం అభిమానులు పైసా వసూల్ పరుగుల పండగను వీక్షించారు.
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ ఖాతాలో ఆరో విజయం చేరింది. శనివారం జరిగిన పోరులో పంజాబ్ 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తుచేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కేఎల్ రాహుల్ (67 బంతుల్లో 152 నాటౌట్; 16 ఫోర్లు, 9 సిక్స్‌లు) భారీ సెంచరీతో కదం తొక్కగా... నితీశ్ రాణా (44 బంతుల్లో 91; 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపులు మెరిపించాడు.
వీరిద్దరు రెండో వికెట్‌కు 220 పరుగులు జోడించడంతో... ఢిల్లీ కొండంత స్కోరు చేయగలిగింది. ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీకి ఇదే అత్యధిక స్కోరు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో మూడో అత్యధిక స్కోరు చేసిన బ్యాటర్‌గా రాహుల్ నిలిచాడు. అనంతరం లక్ష్యఛేదనలో పంజాబ్ 18.5 ఓవర్లలో 4 వికెట్లకు 265 పరుగులు చేసింది. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (26 బంతుల్లో 76; 9 ఫోర్లు, 5 సిక్స్‌లు), శ్రేయస్ అయ్యర్ (36 బంతుల్లో 71 నాటౌట్; 3 ఫోర్లు, 7 సిక్స్‌లు) హాఫ్‌సెంచరీలతో విజృంభించగా... ప్రియాన్ష్ ఆర్య (17 బంతుల్లో 43; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) దంచికొట్టాడు.
రాహుల్ రాక్స్...
ఈ సీజన్‌లో తొలిసారి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ ఆరంభం నుంచే... దూకుడుగా ఆడింది. మూడో ఓవర్‌లో నిసాంక (11) వెనుదిరగగా... అక్కడి నుంచి రాహుల్, రాణా మోత మొదలైంది. ఈ జంట వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదడంతో పవర్ ప్లే ముగిసేసరికి ఢిల్లీ 68/1తో నిలిచింది. ఈ క్రమంలో రాహుల్ 26 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకోగా... బార్ట్‌లెట్ వేసిన 12వ ఓవర్‌లో రాణా వరుసగా 6, 4, 4, 4, 4, 6తో 28 పరుగులు రాబట్టాడు. అర్‡్షదీప్ ఓవర్‌లో 4, 6, 4, 4 కొట్టిన రాహుల్ యాన్సెన్ ఓవర్‌లో మరో రెండు ఫోర్లతో 47 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వైశాక్ వేసిన 16వ ఓవర్‌లో రాహుల్ 6, 6, 6, 4తో విజృంభించాడు. సెంచరీకి సమీపించిన నితీశ్ రాణా భారీ షాట్‌కు ప్రయత్నించి అవుట్ కాగా... రాహుల్ ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు.
6 ఓవర్లలో 116 పరుగులు
కొండంత లక్ష్యం ముందున్నా పంజాబ్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఓపెనర్లు ప్రియాన్ష్ , ప్రభ్‌సిమ్రన్ పోటీపడి బౌండరీలు బాదడంతో స్కోరు బోర్డు రాకెట్‌ను తలపించింది. అక్షర్ వేసిన మూడో ఓవర్‌లో రెండు సిక్స్‌లు ఒక ఫోర్‌తో ఆర్య 20 పరుగులు రాబట్టుకోగా... అఖీబ్ ఓవర్‌లో ప్రభ్‌సిమ్రన్ 3 సిక్స్‌లు బాదాడు. ఐదో ఓవర్‌లో నటరాజన్ 9 పరుగులే ఇవ్వగా... ముకేశ్ వేసిన ఆరో ఓవర్‌లో ప్రభ్‌సిమ్రన్ 6 ఫోర్లు కొట్టాడు. దీంతో పవర్ ప్లే ముగిసే సరికి పంజాబ్ 116 పరుగులు చేసింది. ఆ తర్వాత వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో అవుటైనా... శ్రేయస్ మిగిలిన పని పూర్తిచేశాడు.
శ్రేయస్ క్యాచ్ మిస్
ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఫీల్డింగ్ పేలవంగా సాగింది. విప్రాజ్ నిగమ్ వేసిన 15వ ఓవర్ చివరి బంతికి శ్రేయస్ ఇచ్చిన క్యాచ్‌ను కరుణ్ నాయర్ వదిలేశాడు. అదే ఓవర్‌లో నేహల్ వధేరా (25; 3 ఫోర్లు, 1 సిక్స్) క్యాచ్‌ను ఒడిసి పట్టిన కరుణ్... శ్రేయస్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను నేలపాలు చేశాడు. అప్పటికి పంజాబ్ విజయానికి 31 బంతుల్లో 63 పరుగులు అవసరం కాగా... శ్రేయస్ 29 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బ్యాటింగ్ చేస్తున్నాడు. తదుపరి ఓవర్ రెండో బంతికి సైతం శ్రేయస్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను మరోసారి కరుణ్ నాయర్ జారవిడిచాడు. దీన్ని సది్వనియోగ పరుచుకున్న అయ్యర్... అదే ఓవర్‌లో 6, 4, 6, 6 కొట్టి సమీకరణాన్ని సులభతరం చేశాడు. నటరాజన్ ఓవర్‌లోనూ 6, 4 బాదిన శ్రేయస్ 26 బంతుల్లో పిఫ్టీ మార్క్ దాటడంతో పాటు... శశాంక్ సింగ్ (19 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) అండతో జట్టును విజయ తీరాలకు చేర్చాడు.
152 ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ చేసిన స్కోరు. ఐపీఎల్‌లో ఓ భారత బ్యాటర్ చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోరు ఇదే. అభిõÙక్ శర్మ (141) రెండో స్థానంలో ఉన్నాడు. ఓవరాల్‌గా క్రిస్ గేల్ (175; 2013లో), మెక్‌కల్లమ్ (158; 2008లో) తర్వాత లీగ్‌లో అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాటర్ రాహుల్.
ఎన్‌గిడికి గాయం...
పంజాబ్ ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో ప్రియాన్ష్ ఆర్య కొట్టిన బంతిని అందుకునే క్రమంలో ఢిల్లీ ప్లేయర్ ఎన్‌గిడి గాయపడ్డాడు. మిడాఫ్ ప్రాంతంలో బంతిని క్యాచ్ పట్టే క్రమంలో ఎన్‌గిడి కిందపడ్డాడు. దీంతో తల బలంగా నేలకు తాకి అక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే వైద్య బృందం అతడిని పరీక్షించి మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అతడి స్థానంలో విప్రాజ్ నిగమ్ ‘కన్‌కషన్ సబ్‌స్టిట్యూట్’గా మైదానంలోకి వచ్చాడు. కాగా మ్యాచ్ అనంతరం ఎన్‌గిడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఫ్రాంచైజీ తెలిపింది.
⇒ 1 ఐపీఎల్‌లో ఇదే (265) అత్యధిక పరుగుల ఛేదన. 2024 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై 262 పరుగుల లక్ష్యాన్ని చేధించిన పంజాబ్ కింగ్స్... ఇప్పుడు దానికంటే కాస్త ఎక్కువ స్కోరును ఛేదించింది.
⇒ 220 రెండో వికెట్‌కు రాహుల్, నితీశ్ రాణా జోడించిన పరుగులు. ఐపీఎల్‌లో ఏ వికెట్‌కైనా ఇది రెండో అత్యధిక భాగస్వామ్యం. 2016లో విరాట్ కోహ్లి–ఏబీ డివిలియర్స్ జోడీంచిన 229 పరుగుల భాగస్వామ్యం ‘టాప్’లో ఉంది.
⇒ 2 ఈ మ్యాచ్‌లో పంజాబ్ 5.2 ఓవర్లలో 100 పరుగుల మార్క్ అందుకుంది. ఐపీఎల్‌లో ఇది రెండో వేగవంతమైంది. 2024లో ఢిల్లీపైనే సన్‌రైజర్స్ హైదరాబాద్ 5 ఓవర్లలోనే వంద పరుగులు చేసింది. ఓవరాల్‌గా పవర్‌ప్లే (6 ఓవర్లలో) పంజాబ్ 116 పరుగులు చేసి రెండో స్థానంలో ఉంది. సన్‌రైజర్స్ 125తో అగ్ర స్థానంలో ఉంది.
స్కోరు వివరాలు
పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: నిసాంక (సి) ప్రభ్‌సిమ్రన్ (బి) అర్‡్షదీప్ 11; రాహుల్ (నాటౌట్) 152; నితీశ్ (సి) శ్రేయస్ (బి) బార్ట్‌లెట్ 91; మిల్లర్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్లకు) 264. వికెట్ల పతనం: 1–28, 2–248. బౌలింగ్: అర్‡్షదీప్ 4–0–49–1; బార్ట్‌లెట్ 4–0–69–1; యాన్సెన్ 4–0–45–0; వైశాక్ 3–0–48–0; చాహల్ 4–0–42–0; స్టొయినిస్ 1–0–11–0.
పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్ష్ ఆర్య (సి) రిజ్వీ 43; ప్రభ్‌సిమ్రన్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 76; కూపర్ (బి) కుల్దీప్ 17; శ్రేయస్ (నాటౌట్) 71; నేహల్ (సి) (సబ్) కరుణ్ (బి) విప్రాజ్ 25; శశాంక్ (నాటౌట్) 19; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (18.5 ఓవర్లలో 4 వికెట్లకు) 265. వికెట్ల పతనం: 1–126, 2–132, 3–145, 4–201. బౌలింగ్: అఖీబ్ 2–0–41–0; ముకేశ్ 3–0–55–0; అక్షర్ 4–0–44–1; నటరాజన్ 3.5–0–54–0; కుల్దీప్ 4–0–46–2; విప్రాజ్ నిగమ్ 2–0–24–1.


