
ఆసియాకప్-2025లో రసవత్తర పోరుకు సమయం అసన్నమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం(సెప్టెంబర్ 14) దుబాయ్ వేదికగా భారత్-పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం ఇరు జట్లు అన్ని విధాల సిద్దమైంది.
ఇప్పటికే ఈ టోర్నీలో చిరకాల ప్రత్యర్థులు శుభారంభం చేశారు. టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో యూఏఈను చిత్తు చేయగా.. పాక్ తమ మొదటి మ్యాచ్‌లో ఒమన్‌ను మట్టికర్పించింది. ఈ మల్టీనేషన్ టోర్నమెంట్లలో పాక్‌పై భారత్‌కు మంచి ట్రాక్ రికార్డు ఉంది.
చివరగా ఈ రెండు జట్లు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో పాక్‌ను భారత్ చిత్తు చేసింది. ఇప్పుడు మళ్లీ ఆరు నెలలు తర్వాత దాయాదుల మధ్య క్రికెట్ సమరం జరగనుంది. ఈ మ్యాచ్‌లో కూడా పాక్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించాలని భారత్ పట్టుదలతో ఉంది.
ఇక ఈ బ్లాక్ బ్లాస్టర్ మ్యాచ్‌కు ముందు పాక్ యువ ఓపెనర్ సైమ్ అయూబ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమకు టీమిండియాపై గెలవడం ఒక్కటే ముఖ్యం కాదని, టోర్నీ విజేతగా నిలవడమే తమ లక్ష్యమని అయూబ్ చెప్పుకొచ్చాడు.
"మాకు జ్ఞాపకాలు ముఖ్యం కాదు. మా దృష్టింతా ప్రస్తుతం టోర్నమెంట్‌పైనే ఉంది. ఆసియాకప్ విజేతగా మేము నిలవాలనుకుంటున్నాము. టీమిండియాతో మ్యాచ్ ఒక్కటే మాకు ముఖ్యం కాదు. ఛాంపియన్‌షిప్‌ను గెలిచేందుకు మేము ఆతృతగా ఎదురు చూస్తున్నాము" అని ఒమన్‌తో మ్యాచ్ అనంతరం అయూబ్ పేర్కొన్నాడు.
కాగా ఒమన్‌తో మ్యాచ్‌లో అయూబ్ బ్యాట్‌తో విఫలమైన బంతితో సత్తా చాటాడు. రెండు కీలక వికెట్లు పడగొట్టి పసికూన పతనాన్ని శాసించాడు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది.
పాక్ బ్యాటర్లలో మొహమ్మద్ హ్యారిస్ (43 బంతుల్లో 66) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఒమన్ బౌలర్లలో షా ఫైసల్, ఆమిర్ కలీమ్ మూడేసి వికెట్లు తీయగా.. మొహమ్మద్ నదీమ్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం లక్ష్య చేధనలో ఒమన్ కేవలం 67 పరుగులకే ఆలౌటైంది.
ఫలితంగా 93 పరుగుల తేడాతో పాక్ విజయం సాధించింది. పాక్ బౌలర్లలో సూఫియాన్ ముకీమ్, సయీమ్ ఆయుబ్ ఫాహిమ్ అష్రాఫ్ రెండేసి వికెట్లు సాధించారు. వీరితోపాటు షాహిన్ ఆఫ్రిది, అబ్రార్ అహ్మద్ , మొహమ్మద్ నవాజ్‌తలా ఒక వికెట్ పడగొట్టారు.
చదవండి: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా..