శతక్కొట్టిన వైభవ్‌, జితేశ్‌ శర్మ మెరుపులు.. భారత్‌ ఘన విజయం | Asia Cup Rising Stars Vaibhav Ton Jitesh Shines India Beat UAE By 148 Runs | Sakshi
Sakshi News home page

శతక్కొట్టిన వైభవ్‌, జితేశ్‌ శర్మ మెరుపులు.. భారత్‌ ఘన విజయం

Nov 14 2025 8:20 PM | Updated on Nov 14 2025 8:54 PM

Asia Cup Rising Stars Vaibhav Ton Jitesh Shines India Beat UAE By 148 Runs

ఆసియా క్రికెట్‌ మండలి పురుషుల ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌-2025 టోర్నమెంట్‌లో భారత్‌-‘ఎ’ జట్టు శుభారంభం అందుకుంది. దోహా వేదికగా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE)తో మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. ప్రత్యర్థి జట్టును ఏకంగా 148 పరుగుల తేడాతో చిత్తు చేసి జయభేరి మోగించింది. 

ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ టీ20 టోర్నీలో భాగంగా వెస్ట్‌ ఎండ్‌ పార్క్‌ అంతర్జాతీయ స్టేడియం వేదికగా భారత్‌- యూఏఈ (IND A vs UAE) జట్లు శుక్రవారం తలపడ్డాయి. టాస్‌ గెలిచిన భారత్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుని.. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి ఏకంగా 297 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది.

శతక్కొట్టిన వైభవ్‌, జితేశ్‌ శర్మ మెరుపులు
ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) భారీ, విధ్వంసకర శతకం (42 బంతుల్లో 11 ఫోర్లు, 15 సిక్సర్లు- 144)తో విరుచుకుపడగా.. జితేశ్‌ శర్మ (Jitesh Sharma) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. నాలుగో నంబర్‌ బ్యాటర్‌గా వచ్చిన ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ 32 బంతులు ఎదుర్కొని ఎనిమిది ఫోర్లు, ఆరు సిక్స్‌లు బాది 83 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు.

మిగిలిన వాళ్లలో వన్‌డౌన్‌ బ్యాటర్‌ నమన్‌ ధీర్‌ (23 బంతుల్లో 34) ఫర్వాలేదనిపించాడు. ఓపెనర్‌ ప్రియాన్ష్‌ ఆర్య (10) రనౌట్‌ కాగా.. నేహాల్‌ వధేరా (14) నిరాశపరిచాడు. ఆఖర్లో రమణ్‌దీప్‌ సింగ్‌ (8 బంతుల్లో 6) జితేశ్‌తో కలిసి అజేయంగా నిలిచాడు. యూఏఈ బౌలర్లలో ముహమ్మద్‌ ఫరాజుద్దీన్‌, అయాన్‌ ఖాన్‌, ముహమ్మద్‌ అర్ఫాన్‌ చెరో వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు.

కుప్పకూలిన టాపార్డర్‌
ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ ఆది నుంచే తడబడింది. భారత బౌలర్ల ధాటికి టాపార్డర్‌ కుప్పకూలింది. ఓపెనర్లు మయాంక్‌ రాజేశ్‌ కుమార్‌ (18), కెప్టెన్‌ అలిషాన్‌ షరాఫు (3) నిరాశపరచగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ అహ్మద్‌ తారిక్‌ డకౌట్‌ అయ్యాడు.

సొహైబ్‌ మెరుపు అర్ధ శతకం వృథా
ఈ క్రమంలో నాలుగో నంబర్‌ బ్యాటర్‌ సొహైబ్‌ ఖాన్‌ మెరుపు అర్ధ శతకం (41 బంతుల్లో 63) ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే, గుర్జప్‌నీత్‌ సింగ్‌ బౌలింగ్‌లో నమన్‌ ధీర్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో సొహైబ్‌ మెరుపులకు తెరపడింది. 

ఆ తర్వాత వచ్చిన వాళ్లలో హర్షిత్‌ కౌశిక్‌ డకౌట్‌ కాగా.. వికెట్‌ కీపర్‌ సయీద్‌ హైదర్‌ (20), ముహమ్మద్‌ అర్ఫాన్‌ (26) ఫర్వాలేదనిపించారు. ఆఖర్లో అయాన్‌ ఖాన్‌ 2, ముహమ్మద్‌ ఫరాజుద్దీన్‌ 2 పరుగులతో అజేయంగా నిలిచారు.

ఫలితంగా.. నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి ఏడు వికెట్ల నష్టానికి కేవలం 149 పరుగులు మాత్రమే చేసిన యూఏఈ.. భారత్‌-‘ఎ’ జట్టు చేతిలో భారీ ఓటమి చవిచూసింది. 148 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. 

గుర్జప్‌నీత్‌ సింగ్‌ మూడు వికెట్లు
భారత బౌలర్లలో గుర్జప్‌నీత్‌ సింగ్‌కు మూడు వికెట్ల తో సత్తా చాటగా.. హర్ష్‌ దూబే రెండు, రమణ్‌దీప్‌ సింగ్‌ , యశ్‌ ఠాకూర్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు. సెంచరీ వీరుడు వైభవ్‌ సూర్యవంశీకి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. ఆదివారం నాటి తదుపరి మ్యాచ్‌లో భారత్‌- పాకిస్తాన్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది.

చదవండి: చరిత్ర సృష్టించిన వైభవ్‌ సూర్యవంశీ.. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement