Asia Cup 2025: ఏ జట్టునైనా ఓడిస్తాం: పాకిస్తాన్‌ కెప్టెన్‌ | Good Enough To Beat Any Team: Pakistan Captain Warning Ahead Ind vs Pak | Sakshi
Sakshi News home page

Asia Cup 2025: ఏ జట్టునైనా ఓడిస్తాం: పాకిస్తాన్‌ కెప్టెన్‌

Sep 13 2025 1:23 PM | Updated on Sep 13 2025 1:29 PM

Good Enough To Beat Any Team: Pakistan Captain Warning Ahead Ind vs Pak

పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు ఆసియా కప్‌-2025 (Asia Cup) టోర్నమెంట్లో శుభారంభం అందుకుంది. తొలి మ్యాచ్‌లో పసికూన ఒమన్‌ను ఎదుర్కొన్న సల్మాన్‌ ఆఘా బృందం.. 93 పరుగుల తేడాతో విజయం సాధించింది. దుబాయ్‌ వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పాక్‌.. తొలుత బ్యాటింగ్‌ చేసింది.

ఆయుబ్‌ డకౌట్‌.. హ్యారిస్‌ అర్ధ శతకం
ఓపెనర్లలో షాహిబ్‌జాదా ఫర్హాన్‌ (29) ఫర్వాలేదనిపించగా.. సయీమ్‌ ఆయుబ్‌ డకౌట్‌ అయ్యాడు. అయితే, వన్‌డౌన్‌ బ్యాటర్‌ మొహమ్మద్‌ హ్యారిస్‌ అర్ధ శతకం (43 బంతుల్లో 66)తో రాణించడంతో పాక్‌ ఇన్నింగ్స్‌ గాడినపడింది.

హ్యారిస్‌తో పాటు ఫఖర్‌ జమాన్‌ (16 బంతుల్లో 23 నాటౌట్‌) రాణించగా.. నవాజ్‌ 19 పరుగులు చేయగలిగాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో పాక్‌ ఏడు వికెట్ల నష్టానినకి 160 పరుగులు రాబట్టగలిగింది. ఒమన్‌ బౌలర్లలో షా ఫైసల్‌, ఆమిర్‌ కలీమ్‌ మూడేసి వికెట్లు తీయగా.. మొహమ్మద్‌ నదీమ్‌ ఒక వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు.

 67 పరుగులకే ఆలౌట్‌ చేసి
ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఒమన్‌ను పాక్‌ 67 పరుగులకే ఆలౌట్‌ చేసి సత్తా చాటింది. స్పిన్నర్లు సూఫియాన్‌ ముకీమ్‌, సయీమ్‌ ఆయుబ్‌.. పేసర్‌ ఫాహిమ్‌ అష్రాఫ్‌ రెండేసి వికెట్లు తీయగా..  షాహిన్‌ ఆఫ్రిది (పేసర్‌), అబ్రార్‌ అహ్మద్‌ (స్పిన్నర్‌), మొహమ్మద్‌ నవాజ్‌ (స్పిన్నర్‌) తలా ఒక వికెట్‌ పడగొట్టారు.

ఇక ఒమన్‌ బ్యాటర్లలో హమావ్‌ మీర్జా 27 పరుగులతో టాప్‌ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. ఒమన్‌పై విజయానంతరం పాక్‌ కెప్టెన్‌ సల్మాన్‌ ఆఘా మాట్లాడుతూ.. బౌలింగ్‌ విభాగం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. తమ జట్టులో మేటి స్పిన్నర్లు ఉన్నారని.. యూఏఈ వంటి వేదికపై వారి అవసరమే ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నాడు.

స్పిన్నర్లు కీలకం
‘‘బ్యాటింగ్‌పై మేము మరింత దృష్టి సారించాల్సి ఉంది. అయితే, బౌలింగ్‌ పరంగా మా వాళ్లు అద్భుతం. మా బౌలర్ల ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నాను. మా జట్టులో ముగ్గురు స్పిన్నర్లు.. తమకు తామే ప్రత్యేకం. వీరికి తోడుగా ఆయుబ్‌ కూడా ఉన్నాడు.

దుబాయ్‌, అబుదాబి వంటి వేదికల్లో స్పిన్నర్లు కీలకం. మాకు 4-5 స్పిన్‌ ఆప్షన్లు ఉండటం సానుకూలాంశం. అయితే, మేము ఈ మ్యాచ్‌లో 180 పరుగులు చేయాల్సింది. కానీ ఒక్కోసారి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోతాము. ఆటలో ఇలాంటివి సహజం.

ఎలాంటి జట్టునైనా ఓడించగలము
నిజానికి ఇక్కడ మేము చాలా రోజులుగా ఆడుతున్నాం. ఈ టోర్నీకి ముందు టీ20 ట్రై సిరీస్‌ ఆడాము. అలవోకగానే సిరీస్‌ను సొంతం చేసుకున్నాము. సుదీర్ఘ కాలంలో మా ప్రణాళికలను పక్కాగా అమలు చేయగలిగితే ఎలాంటి జట్టునైనా ఓడించగలము’’ అని సల్మాన్‌ ఆఘా ధీమా వ్యక్తం చేశాడు.

కాగా యూఏఈ వేదికగా ఆసియా కప్‌-2025లో గ్రూప్‌-‘ఎ’ నుంచి భారత్‌, పాకిస్తాన్‌, ఒమన్‌, యూఏఈ... గ్రూప్‌-‘బి’ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గనిస్తాన్‌, హాంకాంగ్‌ రేసులో ఉన్నాయి. ఇక ఇప్పటికే టీమిండియా యూఏఈపై గెలుపొందగా.. పాక్‌ ఒమన్‌పై గెలిచింది. అయితే, నెట్‌ రన్‌రేటు పరంగా అందనంత ఎత్తులో ఉన్న భారత్‌ (+10.483) ప్రస్తుతం గ్రూప్‌-‘ఎ’ టాపర్‌గా ఉండగా.. పాక్‌ (+4.650) రెండో స్థానంలో ఉంది.

ఆసియా కప్‌-2025: పాకిస్తాన్‌ వర్సెస్‌ ఒమన్‌ స్కోర్లు
👉పాకిస్తాన్‌- 160/7 (20)
👉ఒమన్‌- 67 (16.4)
👉ఫలితం: ఒమన్‌పై 93 పరుగుల తేడాతో పాక్‌ గెలుపు.

చదవండి: సూర్యకుమార్‌ యాదవ్‌ ప్రపంచ రికార్డు బద్దలు.. తొలి ప్లేయర్‌గా సాల్ట్‌ చరిత్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement