పంజాబ్‌ కింగ్స్‌ మరో చరిత్ర | Not Highest Successful Chase, Punjab Kings Smash Another World Record In IPL | Sakshi
Sakshi News home page

పంజాబ్‌ కింగ్స్‌ మరో చరిత్ర

Apr 26 2026 11:16 AM | Updated on Apr 26 2026 12:47 PM

Not Highest Successful Chase, Punjab Kings Smash Another World Record In IPL

ఐపీఎల్‌ 2026లో పంజాబ్‌ కింగ్స్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌పై 265 పరుగుల రికార్డు లక్ష్యాన్ని ఛేదించిన విషయం తెలిసిందే. ఈ లక్ష్య ఛేదన ఐపీఎల్‌లోనే కాకుండా యావత్‌ పొట్టి క్రికెట్‌లోనే అత్యధికం. ఈ మ్యాచ్‌కు ముందు వరకు కూడా ఈ రికార్డు పంజాబ్‌ పేరిటే ఉండేది. 2024 ఎడిషన్‌లో ఈ జట్టు కేకేఆర్‌పై 262 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.

టీ20 చరిత్రలో అత్యధిక రన్ ఛేజ్‌లు ఇవే
పంజాబ్ కింగ్స్- 265/4- ప్రత్యర్ధి- ఢిల్లీ క్యాపిటల్స్‌
పంజాబ్ కింగ్స్‌-262/2- ప్రత్యర్ధి-కేకేఆర్‌
సౌతాఫ్రికా- 259/4- ప్రత్యర్ధి- వెస్టిండీస్‌
బ్రిస్బేన్ హీట్‌-258/2- ప్రత్యర్ధి- పెర్త్ స్కార్చర్స్

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ మరో భారీ రికార్డు కూడా నెలకొల్పింది. ఇప్పటివరకు తలో ఐదు సార్లు ఛాంపియన్లైన సీఎస్‌కే, ముంబై ఇండియన్స్‌ కూడా సాధించలేని ఘనతను సాధించింది.

శ్రేయస్‌ అయ్యర్‌ నేతృత్వంలో ఈ సీజన్‌లో అద్భుత ప్రదర్శనలతో దూసుకుపోతున్న ఈ జట్టు.. తొలి ఏడు మ్యాచ్‌లలో ఆరు విజయాలు నమోదు చేయగా, మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. దీంతో ఏడు లీగ్ మ్యాచ్‌ల అనంతరం 13 పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది. ఈ గణాంకాల ద్వారానే పంజాబ్‌ సరికొత్త చరిత్ర సృష్టించింది.

ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఏ జట్టూ తొలి ఏడు మ్యాచ్‌ల తర్వాత 13 పాయింట్లు సాధించలేదు. 12 పాయింట్లు మాత్రమే గరిష్టంగా ఉండేది. ఆ ఘనతను ముంబై, చెన్నై, గుజరాత్, రాజస్థాన్ వంటి పలు జట్లు సాధించాయి. ఇప్పుడు పంజాబ్ ఆ రికార్డును చెరిపేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది.

కాగా, నిన్నటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసి ఢిల్లీ.. కేఎల్‌ రాహుల్‌ (152 నాటౌట్‌), నితీశ్‌ రాణా (91) విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. 

అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యాన్ని పంజాబ్‌ ఆది నుంచే కరిగించుకుంటూ వచ్చింది. ఓపెనర్లు ప్రియాంశ్‌ ఆర్య (43), ‍ప్రభ్‌సిమ్రన్‌ (76) తమ సహజ శైలిలో మెరుపు ఆరంభాన్ని ఇవ్వగా.. శ్రేయస్‌ అయ్యర్‌ (71 నాటౌట్‌) నమ్మశక్యం కాని బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను ముగించాడు. ఫలితంగా పంజాబ్‌ ఈ సీజన్‌లో తమ జైత్రయాత్రను కొనసాగించింది. 
 

Advertisement
 
Advertisement
Advertisement