హార్దిక్‌ కాదు!.. ఆ ముగ్గురు కెప్టెన్లపై వేటు! | Not Hardik, These 3 IPL 2026 Captains Set To be Sacked: Report | Sakshi
Sakshi News home page

హార్దిక్‌ కాదు!.. ఆ ముగ్గురు కెప్టెన్లపై వేటు!

May 14 2026 4:39 PM | Updated on May 14 2026 4:57 PM

Not Hardik, These 3 IPL 2026 Captains Set To be Sacked: Report

పంజాబ్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌తో అక్షర్‌ పటేల్‌

ఐపీఎల్‌-2026 లీగ్‌ దశ ముగింపునకు వచ్చింది. ఇంకో పది రోజుల్లో (మే 24) లీగ్‌ స్టేజీ పూర్తి కానుంది. ఇలాంటి తరుణంలో ఓ సంచలన నివేదిక తెరమీదకు వచ్చింది. ఈ సీజన్‌లో చెత్త ప్రదర్శన కనబరిచిన ముగ్గురు కెప్టెన్లపై వేటు పడనుందని దాని సారాంశం.

ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడు రిషభ్‌ పంత్‌. లక్నో సూపర్‌ జెయింట్స్‌ మెగా వేలం-2025లో అతడిని ఏకంగా రూ. 27 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, ఆటగాడిగా, కెప్టెన్‌గా ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ పూర్తిగా తేలిపోతున్నాడు.

చెత్త ప్రదర్శన
గతేడాది చెత్త ప్రదర్శనతో జట్టును ఏడో స్థానంలో నిలిపిన పంత్‌.. తాజా ఎడిషన్‌లోనూ వైఫల్యాలు కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటికి 11 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న లక్నో కేవలం మూడే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో ఉంది.

వ్యక్తిగతంగానూ పంత్‌ ప్రదర్శన బాగాలేదు. పదకొండు ఇన్నింగ్స్‌లో కలిప కేవలం 251 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే.. ఢిల్లీ క్యాపిటల్స్‌ సారథి అక్షర్‌ పటేల్‌ కూడా విమర్శల పాలవుతున్నాడు. పన్నెండు మ్యాచ్‌లలో కలిపి 100 పరుగులే చేసిన ఈ ఆల్‌రౌండర్‌.. కేవలం పది వికెట్లు మాత్రమే తీయగలిగాడు.

అక్షర్‌ అంతంత మాత్రమే
లీగ్‌ దశలో అక్షర్‌ సేన ఇప్పటికి 12 మ్యాచ్‌లు పూర్తి చేసుకుని ఐదు గెలిచి పట్టికలో ఏడో స్థానంలో కొట్టుమిట్టాడుతోంది. ఇక అజింక్య రహానే పరిస్థితి కూడా ఇలాగే ఉంది. జట్టుకు టైటిల్‌ అందించిన శ్రేయస్‌ అయ్యర్‌ను వదులుకుని మరీ.. రహానేకు పగ్గాలు ఇచ్చింది కోల్‌కతా నైట్‌ రైడర్స్‌.

రహానేదీ అదే బాట
గతేడాది డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో బరిలోకి దిగిన కేకేఆర్‌.. పద్నాలుగింట ఐదే గెలిచి ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ ఏడాది ఇప్పటికి పదకొండింటిలో నాలుగు గెలిచి ఎనిమిదో స్థానంలో కొట్టుమిట్టాడుతోంది. ఇక రహానే 11 ఇన్నింగ్స్‌ ఆడి 237 పరుగులే చేశాడు.

వేటుకు రంగం సిద్ధం
ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ సన్నిహిత వర్గాలు పీటీతో మాట్లాడుతూ.. ‘‘ముగ్గురు ఐపీఎల్‌ కెప్టెన్లపై వేటుకు రంగం సిద్ధమైంది. ఈ సీజన్‌ ఆఖరి నాటికి వాళ్లు తమ పదవులు కోల్పోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇందకు సంబంధించిన ఫ్రాంఛైజీ వర్గాలు సంకేతాలు ఇచ్చాయి.

అక్షర్‌ పటేల్‌, అజింక్య రహానే, రిషభ్‌ పంత్‌ గత రెండు సీజన్లలో సారథులుగా విఫలమవుతున్నారు. ఒక్కసారి కూడా జట్లను ప్లే ఆఫ్స్‌ దిశగా తీసుకువెళ్లలేకపోయారు’’ అని పేర్కొన్నాయి. ముఖ్యంగా పంత్‌ కెప్టెన్సీ చెత్తగా ఉందని.. అతడి వ్యూహాలు బెడిసికొట్టడం ఫ్రాంఛైజీకి తలనొప్పిగా మారిందని తెలిపాయి.

మరి హార్దిక్‌ పరిస్థితి ఏంటి?
పంత్‌, అక్షర్‌, రహానే సంగతి ఇలా ఉంటే.. ముంబై ఇండియన్స్‌ సారథి హార్దిక్‌ పాండ్యా గురించి మాత్రం సదరు వర్గాలు స్పందించలేదు. 2024లో ముంబై కెప్టెన్‌గా వచ్చిన హార్దిక్‌ తొలి ఏడాది అట్టడుగున పదో స్థానంలో నిలిపాడు. 

గతేడాది ప్లే ఆఫ్స్‌ చేర్చినా.. ఈ ఏడాది పదో స్థానం కోసం ముంబై లక్నోతో పోటీపడుతోంది. ఇప్పటికే గాయం సాకుతో హార్దిక్‌ జట్టుకు దూరమయ్యాడు. త్వరలోనే అతడిపై వేటు పడనుందనే వార్తలు వచ్చాయి. అయితే, తాజా నివేదికలో అతడి పేరు లేకపోవడం గమనార్హం.

చదవండి: బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు!.. స్పందించిన కమిన్స్‌

Advertisement
 
Advertisement
Advertisement