తనపై వస్తున్న వదంతులపై ఆస్ట్రేలియా టెస్టు, వన్డే కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్పందించాడు. తన గురించి రాస్తున్న దాంట్లో ఏమాత్రం నిజం లేదంటూ కొట్టిపారేశాడు. ఆసీస్ టెస్టు, వన్డే సారథిగా కమిన్స్‌కు గొప్ప రికార్డు ఉంది. మిచెల్ స్టార్క్‌తో పాటు పేస్ దళంలో బౌలర్‌గానూ కమిన్స్ కీలకం.
అయితే, కమిన్స్‌తో పాటు మరికొందరు సీనియర్ క్రికెటర్లు క్రికెట్ ఆస్ట్రేలియాను (CA)ను బెదిరిస్తున్నారంటూ ‘ది ఏజ్’ కథనం పేర్కొంది. తమ జీతాలు పెంచకపోతే దేశీ టీ20 లీగ్ బిగ్‌బాష్ లీగ్ (BBL)ను బహిష్కరిస్తామని వాళ్లు బ్లాక్‌మెయల్ చేశారన్నది ఆ కథనం సారాంశం.
దాదాపు రూ. 7 కోట్లు
2027-28 సీజన్‌కు గానూ.. ఒకవేళ తాము కోరినట్లు 1 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 7 కోట్లు) చెల్లించకపోతే.. ఈ సీజన్‌లో ఆడేది లేదని ఆటగాళ్లు తేల్చిచెప్పినట్లు సదరు కథనం పేర్కొంది. బీబీఎల్‌ను వదిలి సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఆడేందుకు వెళ్తామని హెచ్చరించినట్లు తెలిపింది.
నువ్వు రాసినదంతా కల్పితం
ఇందుకు సంబంధించిన వార్తను ఓ నెటిజన్ ‘ఎక్స్’లో షేర్ చేయగా.. ప్యాట్ కమిన్స్ ఘాటుగా స్పందించాడు. ‘‘ది హండ్రెడ్ లీగ్‌లో నాకు ఆఫర్ వచ్చినట్లు.. సౌతాఫ్రికా టీ20 లీగ్ నిరభ్యంతర పత్రం విషయంలో నేనేదో డిమాండ్ చేసినట్లు.. నా గురించి నువ్వు రాసినదంతా కల్పితం మాత్రమే’’ అని కమిన్స్ బదులిచ్చాడు.
కాగా వెన్నునొప్పి కారణంగా ఇంగ్లండ్‌తో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన కమిన్స్.. ఆ తర్వాత ఆటకు దూరమయ్యాడు. దాదాపు నాలుగు నెలల పాటు విశ్రాంతి తీసుకున్న ఈ పేస్ బౌలర్.. ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్సీ విధులతో బిజీగా ఉన్నాడు.
అయితే, ఐపీఎల్-2026లో సన్‌రైజర్స్ ఆరంభ మ్యాచ్‌లకు దూరమైన కమిన్స్... ఇటీవలే తిరిగి వచ్చి జట్టును విజయపథంలో తీసుకువెళ్తున్నాడు. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ ఇప్పటికి 12 మ్యాచ్‌లు పూర్తి చేసుకుని ఏడు గెలిచింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న కమిన్స్ బృందం ప్లే ఆఫ్స్ బెర్తు లక్ష్యంగా ముందుకు సాగుతోంది.
చదవండి: ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లి.. సరికొత్త చరిత్ర


