ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లి.. సరికొత్త చరిత్ర | Virat Kohli Scripts History Breaks Chris Gayle World Record, Smashes Stunning Century In RCB Chase Against KKR, Video Viral | Sakshi
Sakshi News home page

ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లి.. సరికొత్త చరిత్ర

May 14 2026 9:44 AM | Updated on May 14 2026 10:21 AM

Virat Kohli Scripts History Breaks Chris Gayle World Record

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) దిగ్గజం విరాట్‌ కోహ్లి అదరగొట్టాడు. ఐపీల్‌-2026లో గత రెండు మ్యాచ్‌ల్లో డకౌట్‌ అయిన ‘కింగ్‌’.. ఈసారి తన స్థాయికి తగ్గ ప్రదర్శనతో చెలరేగాడు.

ఛేదనలో మొనగాడినని మరోసారి నిరూపిస్తూ ఐపీఎల్‌లో తన 9వ సెంచరీతో సత్తా చాటాడు. మొత్తంగా 60 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 105 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో కోహ్లి సరికొత్త చరిత్ర సృష్టించాడు.

ప్రపంచ రికార్డు బద్దలు
టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 14 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న క్రికెటర్‌గా కోహ్లి నిలిచాడు. తద్వారా వెస్టిండీస్‌ దిగ్గజం క్రిస్‌ గేల్‌ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. అదే విధంగా టీ20 ఫార్మాట్లో అత్యధిక సెంచరీల వీరుల జాబితాలో డేవిడ్‌ వార్నర్‌ రికార్డును కోహ్లి సమం చేశాడు.

ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. రాయ్‌పూర్‌ వేదికగా టాస్‌ గెలిచిన ఆర్సీబీ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌.. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది.

ఈ లక్ష్యాన్ని ఆర్సీబీ 19.1 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ కోహ్లి (105 నాటౌట్‌) శతక్కొట్టగా.. దేవ్‌దత్‌ పడిక్కల్‌ (27 బంతుల్లో 39) మెరుగ్గా రాణించాడు.

టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 14 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న క్రికెటర్లు
👉విరాట్‌ కోహ్లి- 409 ఇన్నింగ్స్‌లో
👉క్రిస్‌ గేల్‌- 423 ఇన్నింగ్స్‌లో
👉డేవిడ్‌ వార్నర్‌- 431 ఇన్నింగ్స్‌లో
👉జోస్‌ బట్లర్‌- 468 ఇన్నింగ్స్‌లో
👉అలెక్స్‌ హేల్స్‌- 505 ఇన్నింగ్స్‌లో
👉కీరన్‌ పోలార్డ్‌- 633 ఇన్నింగ్స్‌లో

టీ20 క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లు
👉క్రిస్‌ గేల్‌- 22
👉బాబర్‌ ఆజం- 13
👉డేవిడ్‌ వార్నర్‌- 10
👉విరాట్‌ కోహ్లి- 10
👉రీలీ రొసోవ్‌, సాహిబ్‌జాదా ఫర్హాన్‌- 9
👉క్వింటన్‌ డికాక్‌, అభిషేక్‌ శర్మ- 9.

చదవండి: చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి.. తొలి ప్లేయర్‌గా అరుదైన రి​కార్డు

Advertisement
 
Advertisement
Advertisement