రాజ్‌కోట్ వేదికగా దక్షిణాఫ్రికా 'ఎ' తో జరిగిన రెండో అనధికారిక వన్డేలో 9 వికెట్ల తేడాతో భారత్ 'ఎ' ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో భారత్ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 30.3 ఓవర్లలో కేవలం 132 పరుగులకే కుప్పకూలింది.
భారత బౌలర్ల ధాటికి సఫారీ బ్యాటర్లు విలవిల్లాడారు. స్పిన్నర్ నిశాంత్ సింధు 4 వికెట్లు పడగొట్టగా.. పేసర్లు హర్షిత్ రాణా 3, ప్రసిద్ద్ కృష్ణ రెండు వికెట్లు సాధించారు. సౌతాఫ్రికా బ్యాటర్లలో మూన్‌స్వామి(33) టాప్ స్కోరర్‌గా నిలవగా.. పొటిగిటర్(23), ప్రిటోరియస్(21) రాణించారు.
రుతురాజ్ మెరుపులు..
అనంతరం 133 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఇండియా జట్టు కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 27.5 ఓవర్లలో చేధించింది. స్టార్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (83 బంతుల్లో 9 ఫోర్లతో 68) అజేయ హాఫ్ సెంచరీతో మెరిశాడు. అతడితో పాటు మరో ఓపెనర్ అభిషేక్ శర్మ(22 బంతుల్లో 6 ఫోర్లతో 33) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సౌతాఫ్రికా బౌలర్లలో లుథో సిపామ్లా ఒక్కడే వికెట్ సాధించాడు. ఇక ఇరు జట్ల మధ్య మూడో అనధికారిక వన్డే రాజ్‌కోట్ వేదికగానే నవంబర్ 19న జరగనుంది.
చదవండి: IND vs SA: బవుమాకు క్షమాపణలు చెప్పిన బుమ్రా..! వైరల్


