MS Dhoni- Nayanthara: తమిళ, తెలుగు ప్రేక్షకుల కోసం ధోని! లేడీ సూపర్‌స్టార్‌ నయన్‌తో..

MS Dhoni Start Film Production Company Dhoni Entertainment Says Report - Sakshi

MS Dhoni: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ కారణంగా టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనికి తమిళనాడుతో ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ఆరంభం నుంచి చెన్నై సూపర్‌ కింగ్స్‌కు సారథిగా వ్యవహరిస్తున్న ధోనిని తలా అంటూ అక్కున చేర్చుకున్నారు తమిళ ప్రజలు. అందుకు ప్రతిఫలంగా క్రికెట్‌తో పాటు తమిళ ప్రేక్షకులకు సినిమాలతోనూ వినోదం అందించేందుకు సిద్ధమయ్యాడట ఈ జార్ఖండ్‌ డైనమైట్‌.

తమిళం, తెలుగుతో పాటు..
ఇప్పటికే పలు వ్యాపారాల్లో రాణిస్తున్న ధోని.. తాజాగా ‘ధోని ఎంటరైన్‌మెంట్‌’ పేరిట సినీ నిర్మాణ సంస్థ ప్రారంభించినట్లు సమాచారం. ఈ కంపెనీ ద్వారా తమిళంలో సినిమాలు నిర్మించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళంలోనూ చిత్రాలు ప్రొడ్యూస్‌ చేసేందుకు ధోని సిద్ధమయ్యాడని జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. లెట్స్‌సినిమా సహా క్రీడా విశేషాలు పంచుకునే ముఫద్దల్‌ వోహ్రా అనే ట్విటర్‌ యూజర్‌ ట్వీట్ల ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 

సౌత్‌ ఆడియన్స్‌ లక్ష్యంగా..
కాగా ఇప్పటికే ధోని, ఆయన భార్య సాక్షి ఓ ప్రొడక్షన్‌ హౌజ్‌ స్థాపించిన విషయం తెలిసిందే. రోర్‌ ఆఫ్‌ ది లయన్‌(సీఎస్‌కేపై నిషేధం- రీఎంట్రీ నేపథ్యంలో), బ్లేజ్‌ టూ గ్లోరీ(2011 వరల్డ్‌కప్‌ నేపథ్యంగా డాక్యుమెంటరీ) తదితర చిన్న సినిమాలు నిర్మించారు. ఇప్పుడు సౌత్‌ సినిమాపై దృష్టి సారించినట్లు సన్నిహిత వర్గాల సమాచారం.    

అంతేకాదు ధోని ఎంటరైన్‌మెంట్‌ వ్యవహారాలు చూసుకునేందుకు.. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు సన్నిహితుడైన ఓ వ్యక్తిని ధోని నియమించినట్లు వదంతులు వ్యాపిస్తున్నాయి. ఇక ఈ ప్రొడక్షన్‌ కంపెనీలో మొదటగా తీసే సినిమాలో లేడీ సూపర్‌స్టార్‌ నయనతార కీలక పాత్ర పోషించనున్నారంటూ గతంలోనూ వార్తలు గుప్పుమన్నాయి. 

అయితే, వీటిలో ఎంతవరకు నిజం ఉందన్న విషయం అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే తెలుస్తుంది. ఇదిలా ఉంటే.. చెన్నై సూపర్‌ కింగ్స్‌కు సంబంధించిన స్పెషల్‌ వీడియో రూపకల్పనలో నయన్‌ భర్త విఘ్నేష్‌ శివన్‌.. ధోనితో కలిసి పనిచేసిన విషయం తెలిసిందే. కాగా నయన్‌- విఘ్నేష్‌ దంపతులు తాము కవలలకు జన్మనిచ్చినట్లు ప్రకటించి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top