MS Dhoni World Cup 2011: ఆ అద్భుతానికి దశాబ్దం!

MS Dhoni-inspired India won their 2nd ODI World Cup - Sakshi

‘ధోని ఫినిషెస్‌ ఆఫ్‌ ఇన్‌ స్టైల్‌ ఎ మాగ్నిఫిసెంట్‌ స్ట్రైక్‌ ఇన్‌ టు ద క్రౌడ్‌. ఇండియా లిఫ్ట్‌ ద వరల్డ్‌ కప్‌ ఆఫ్టర్‌ ట్వంటీ ఎయిట్‌ ఇయర్స్‌’... రవిశాస్త్రి కామెంటరీ సగటు భారత క్రికెట్‌ అభిమాని చెవుల్లో ఇప్పటికీ మారు మోగుతూనే ఉంటుంది. సరిగ్గా పదేళ్ల క్రితం ఏప్రిల్‌ 2న ముంబై వాంఖడే మైదానం టీమిండియా గెలుపుతో హోరెత్తింది.

ఉత్కంఠ, ఉత్సాహం, సంతోషం, భావోద్వేగం, ఆనంద భాష్పాలు... ఒకటేమిటి, ఇలా అన్ని రకాల భావనలు ఆ సమయంలో కనిపించాయి. అటు ఆటగాళ్ల ఆనందానికి అవధులు లేకపోగా, అభిమానుల సంబరాల గురించి ఎంత చెప్పినా తక్కువే. కులశేఖర వేసిన 49వ ఓవర్‌ రెండో బంతిని లాంగాన్‌ మీదుగా ధోని సిక్స్‌గా మలచిన షాట్‌ అందరి మనసుల్లో పదేళ్లుగా అలా ముద్రించుకుపోయింది. క్వార్టర్స్‌లో ఆసీస్‌ను, సెమీస్‌లో పాక్‌ను చిత్తు చేసిన జట్టు ఫైనల్లో శ్రీలంకపై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

నాకేమీ అనిపించడం లేదు: గంభీర్
ఫైనల్లో 97 పరుగులతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన గౌతం గంభీర్‌ మాత్రం భిన్నంగా స్పందిస్తూ... ‘మేం గెలిచి పదేళ్లయింది. గతం గురించి ఎక్కువగా గుర్తు చేసుకునే తత్వం కాదు నాది. ప్రపంచకప్‌ గెలిచి మేం ఎవరికీ ఎలాంటి మేలు చేయలేదు. మెగా టోర్నీ కోసం జట్టులోకి ఎంపికై నందుకు బాగా ఆడి గెలిచేందుకు ప్రయత్నించడం మా బాధ్యత. అభిమానులు సం తోషించారు. గర్వపడే క్షణం అనేది వాస్తవమే కానీ అతిగా చర్చించడం మాని భవిష్యత్తుపై దృష్టి పెట్టాలి. పదే పదే 1983, 2011 గురించే ఆలోచిస్తుంటే ఇక ముందుకు వెళ్లేదెప్పుడు’ అని అంటున్నాడు.  
చదవండి: ‘అంపైర్స్‌ కాల్‌’ కొనసాగింపు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top