
ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీని టీమిండియా సమం చేయడంలో మహ్మద్ సిరాజ్‌ది కీలక పాత్ర. ఈ ట్రోఫీలో భాగంగా ఓవల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్టులో సిరాజ్ సంచలన ప్రదర్శన కనబరిచాడు. ఓటమి తప్పదనుకున్న చోట సిరాజ్ తన బౌలింగ్‌తో మ్యాజిక్ చేశాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టి భారత జట్టుకు మరుపురాని విజయాన్ని అందించాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో సిరాజ్ మియా తొమ్మిది వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు.
ఒకే ఒక్కడు..
ఈ ఒక్క మ్యాచ్‌లోనే కాదు సిరీస్ అసాంతం మహ్మద్ సిరాజ్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ముఖ్యంగా సిరాజ్ ఫిట్‌నెస్ గురుంచి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది. ఈ సిరీస్‌లో తన సహచర ఆటగాళ్లు ఫిట్‌నెస్ సమస్యలతో ఒకట్రెండు మ్యాచ్‌లకు దూరమైనప్పటికి.. సిరాజ్ మాత్రం అలుపెరుగని యోధుడిలా అన్ని మ్యాచ్‌లల్లోనూ ఆడాడు.
ఇంగ్లండ్ - భారత్ టెస్టు సిరీస్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడిన ఏకైక బౌలర్‌గా సిరాజ్ నిలిచాడు. ఎటువంటి వర్క్ లోడ్ భావించకుండా ఈ సిరీస్‌లో దాదాపు వెయ్యికి పైగా బంతులు వేశాడు. ఎన్నో లాంగ్ స్పెల్స్ కూడా బౌలింగ్ చేశాడు. కానీ ఎప్పుడూ కూడా సిరాజ్ అలిసిపోయినట్లు కన్పించలేదు. తాజాగా మహ్మద్ సిరాజ్ ఫిట్‌నెస్ సీక్రెట్‌ను అతడి సోదరుడు మొహమ్మద్ ఇస్మాయిల్ భయటపెట్టాడు.
"సిరాజ్ తన ఫిట్‌నెస్‌పై ఎక్కువగా దృష్టి సారిస్తాడు. అతడు జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంటాడు. సరైన డైట్ ప్లాన్‌ను పాటిస్తాడు. సిరాజ్ హైదరాబాద్‌లో ఉన్నా కూడా బిర్యానీని చాలా అరుదుగా తింటాడు. అది కూడా ఇంట్లో తాయారు చేస్తే తింటాడు.
కానీ పిజ్జాలు, ఫాస్ట్ ఫుడ్‌ల జోలికి అస్సలు పోడు. తన శరీరం పట్ల చాలా క్రమశిక్షణతో ఉంటాడు" అని ఇస్మాయిల్ ఇండియా టూడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా ఈ సిరీస్‌లో సిరాజ్ మొత్తంగా 23 వికెట్లు పడగొట్టాడు. ఇందులో రెండు ఫైవ్ వికెట్ హాల్స్ ఉన్నాయి.
చదవండి: ‘డ్రా’ అయినందుకే ఇంత సంబరమా?.. అవును.. కొన్ని పొరపాట్లున్నా..