అతడి మెదడు భుజంలో ఉందా?.. సమర్థించుకున్న ముంబై | MI Accused Of Using Concussion Substitute For Shoulder Injury Coach Reacts | Sakshi
Sakshi News home page

అతడి మెదడు భుజంలో ఉందా?.. సమర్థించుకున్న ముంబై

Apr 24 2026 9:32 AM | Updated on Apr 24 2026 10:42 AM

MI Accused Of Using Concussion Substitute For Shoulder Injury Coach Reacts

ఓటమి బాధలో ఉన్న ముంబై ఇండియన్స్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. ఇంతటి చెత్త ప్రదర్శన ఎప్పుడూ చూడలేదంటూ జట్టు అభిమానులు సైతం తిట్టిపోస్తున్నారు. అదే సమయంలో.. కన్‌కషన్‌ సబ్‌స్టిట్యూట్‌ విషయంలో ముంబై తీసుకున్న నిర్ణయం వివాదానికి దారితీసింది.

ఐపీఎల్‌-2026లో భాగంగా ముంబై గురువారం చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలపడింది. వాంఖడేలో టాస్‌ ఓడిని చెన్నై.. తొలుత బ్యాటింగ్‌కు దిగి నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 207 పరుగులు చేసింది. ఓపెనర్‌ సంజూ శాంసన్‌ అజేయ శతకం (54 బంతుల్లో 101 నాటౌట్‌) రాణించాడు.

ఇక లక్ష్య ఛేదనలో ముంబై 19 ఓవర్లలో కేవలం 104 పరుగులు చేసి కుప్పకూలింది. ఫలితంగా చెన్నై చేతిలో 103 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఐపీఎల్‌ చరిత్రలో పరుగుల పరంగా ముంబైకి ఇదే అతిపెద్ద ఓటమి.

వివాదం ఏమిటంటే?
ఇదిలా ఉంటే.. చెన్నై ఇన్నింగ్స్‌ 17వ ఓవర్లో డీప్‌స్క్వేర్‌ లెగ్‌ వద్ద కార్తీక్‌ శర్మ (19 బంతుల్లో 18) క్యాచ్‌ పట్టే క్రమంలో.. ముంబై స్పిన్నర్‌ మిచెల్‌ సాంట్నర్‌ ఎడమ భుజానికి బలమైన గాయమైంది. అతడు బ్యాటింగ్‌ చేసే స్థితిలో లేడు. అయితే ముంబై ఇన్నింగ్స్‌ సమయంలో సాంట్నర్‌కు బదులు ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ను ‘కన్‌కషన్‌ సబ్‌’ (Concussion Substitute)గా జట్టు బ్యాటింగ్‌కు పంపించడం అనూహ్య పరిణామం.

నిబంధనల ప్రకారం తల, మెడ వంటి సున్నిత భాగాల్లో గాయమై మగతగా అనిపించే మయంలో కన్‌కషన్‌ సబ్‌ను అనుమతిస్తారు. కానీ మిచెల్‌ సాంట్నర్‌ భుజానికి గాయమైతే.. అతడికి బదులు ‘కన్‌కషన్‌ సబ్‌’ ఆటగాడిగా శార్దూల్‌ను పంపడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌పై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్‌ జరుగుతోంది.

అతడి మెదడు భుజంలో ఉందా?
‘‘భుజానికి గాయమైతే కూడా కన్‌కషన్‌ సబ్‌ను అనుమతిస్తారా? సాంట్నర్‌ మెదడు భుజంలో ఉందా ఏమిటి?.. ముంబై ఇండియన్స్‌ ‘క్లాసింగ్‌ చీటింగ్‌’ ఇది. బహుశా అంపైర్లు హెడ్‌ అండ్‌ షోల్డర్‌ షాంపూ వాడుతున్నారేమో. అందుకే ఇలా చేశారు’’ అంటూ నెటిజన్లు ముంబై ఇండియన్స్‌తో పాటు అంపైర్లకు చురకలు అంటిస్తున్నారు.  

ముంబై స్పందన ఇదే
కన్‌కషన్‌ సబ్‌ వివాదంపై ముంబై ఇండియన్స్‌ హెడ్‌కోచ్‌ మహేళ జయవర్దనె స్పందించాడు. ‘‘సాంట్నర్‌ తలకు తొలుత గాయమైంది. ఆ తర్వాత భుజానికీ గాయమైంది. అతడిని స్కానింగ్‌కు పంపించాము. అతడు మగతగా ఉందని చెప్పాడు. భుజం నొప్పి తగ్గడానికి కట్టు వేశారు. నిజానికి అతడు బ్యాటింగ్‌ చేసే స్థితిలో లేడు’’ అని జయవర్దనె వివరణ ఇచ్చాడు.

ఇక అంపైర్‌, రిఫరీ.. లెప్టార్మ్‌ స్పిన్నర్‌ సాంట్నర్‌కు బదులు రైటార్మ్‌ పేసర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ అనుమతించారని.. వారి నిర్ణయానుసారమే తాము శార్దూల్‌ను పంపినట్లు జయవర్దనె తెలిపాడు.

చదవండి: IPL 2026: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్‌.. 19 ఏళ్లలో ఒకే ఒక్కడు

Advertisement
 
Advertisement
Advertisement