మెస్సీ (Photo Credit: FIFA/AFA)
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ ఇటీవలే అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. గత నెల (ఆగష్టు) 31న తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించాడు. అయితే, మెస్సీ మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. జాతీయ జట్టు తరఫున మరోసారి ఆడేందుకు ఈ దిగ్గజ ఫుట్‌బాలర్ సిద్ధమైనట్లు అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ (AFA) వెల్లడించింది.
దిగ్గజానికి వీడ్కోలు మ్యాచ్
బెనిన్‌తో అక్టోబరు 6న జరిగే మ్యాచ్‌కు ఎంపిక చేసిన జట్టులో AFA మెస్సీకి చోటిచ్చింది. ఈ మేరకు.. ‘‘మా జాతీయ జట్టు కోచ్ లియోనల్ స్కలోనీతో చర్చించిన తర్వాత ప్రపంచ అత్యుత్తమ ఆటగాడు, మా జట్టు ఐకాన్.. మా కెప్టెన్ లియోనల్ మెస్సీ.. సెండాఫ్ మ్యాచ్‌కు అతడు అన్ని విధాలా అర్హుడు.
అందుకే అక్టోబరు 6న అతడికి సెండాఫ్ ఇస్తున్నామని చెప్పేందుకు సంతోషిస్తున్నాము’’ అని AFA తన ప్రకటనలో పేర్కొంది. ఈ నేపథ్యంలో మెస్సీ ఫేర్‌వెల్ మ్యాచ్ చూడవచ్చని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, అదే సమయంలో ఫ్రెండ్లీ మ్యాచ్‌లో కాకుండా.. బ్రెజిల్ లేదంటే జర్మనీ వంటి మేటి జట్లతో మెస్సీ ఫేర్‌వెల్ మ్యాచ్ ప్లాన్ చేసి ఉంటే బాగుండేదని పెదవి విరుస్తున్నారు.
ఇది మూడోసారి
కాగా 2007లో తన తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన మెస్సీ.. 2016లో రిటైర్మెంట్ ప్రకటించాడు. 2016 కోపా అమెరికా కప్ చిలీతో ఫైనల్లో పెనాల్టీ కిక్‌ను స్కోర్ చేయలేకపోవడంతో.. ఎదురైన ఓటమితో తీవ్రంగా కుంగిపోయిన మెస్సీ.. ఆవేశంలో రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఆ తర్వాత మనసు మార్చుకుని రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్నాడు. ఈ క్రమంలో అర్జెంటీనాను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లిన మెస్సీ.. 2022లో ఫిఫా ప్రపంచకప్ అందించాడు. ఇక 2026 వరల్డ్‌కప్‌లో రన్నరప్‌గా అర్జెంటీనా సరిపెట్టుకోగా.. ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే, ఫ్రెండ్లీ మ్యాచ్ కోసం మరోసారి యూటర్న్ తీసుకుని.. చివరగా జాతీయ జట్టు తరఫున బరిలో దిగేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
చదవండి: ‘నువ్వెంతగా కష్టపడ్డావో చూశాను.. మన పిల్లలకు నువ్వే హీరో’


